Sankranti Special Buses: సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Andhra Pradesh News | హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 2400 స్పెషల్ బస్సులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా నడుపుతున్నట్లు తెలిపింది.

APSRTC to run Special Buses from Hyderabad to Andhra Pradesh |అమరావతి/ హైదరాబాద్: తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్లే వారి సౌలభ్యం కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.
ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెగ్యులర్ గా నడిచే బస్సులతో పాటు అదనంగా ఈ స్పెషల్ బస్సులు నడుపుతామని చెప్పారు. సంక్రాంతికి నడపనున్న ఈ స్పెషల్ బస్సుల్లో రెగ్యూలర్ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది.
ఆ జిల్లాలకు వెళ్లేవారు ఇది తెలుసుకోండి
హైదరాబాద్‌లోని పెద్ద బస్టాండ్ ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. అందులోనూ పండుగ సమయం కావడంతో ఆ రద్దీని తగ్గించేందుకు జనవరి 10వ తేదీ నుంచి 12 వరకు ఏపీ ఆర్టీసీ కొన్ని మార్పులు చేసింది. ఒంగోలు, మాచర్ల, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వైపు వెళ్లే రెగ్యులర్ బస్సులతో పాటు సంక్రాంతి స్పెషల్ బస్సులను ఎంజీబీఎస్‌కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ గౌలిగూడ (CBS) నుంచి నడిపించనున్నారు. ఆ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాలను గమనించాలని ఆర్టీసీ సూచించింది.
ప్రతి పండుగకు ప్రయాణికులకు ఇక్కట్లు
తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు ఎంత ఘనంగా జరుపుకుంటారో ఏపీలో సంక్రాంతిని అదే రీతిలో జరుపుకుంటారని తెలిసిందే. అయితే ప్రతి ఏడాది పండుగకు వెళ్లే సమయంలో టికెట్లు బుకింగ్ అవ్వక రైలు ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. రెండు ముందే రైళ్లలో రిజర్వేషన్ చేసుకుంటారు. దీంతో చివరి సమయంలో ప్లాన్ చేసుకుని పండుగకు ఇంటికి వెళ్లాలనుకునే వారికి బస్సుల్లో వెళ్లాలంటే ఛార్జీల మోతతో వణుకు పుడుతోంది. ఏపీతో పాటు తెలంగాణ ఆర్టీసీ సైతం సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడపనుంది. పండుగ రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటాయని ప్రయాణికులు ఆ ఛార్జీలు భరించలేక గగ్గోలు పెడుతుంటారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే ప్రత్యేక బస్సులలోనే హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతారు. చూడాలి ఈ ఏడాది సంక్రాంతికి రద్దీ, ప్రయాణికుల జర్నీ ఎలా సాగనుందో..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

