Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
National News: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం ఉదయం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది.

MHA Key Announcement On Manmohan Singh Funeral: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11:45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో మన్మోహన్‌సింగ్ నివాసంలోనే ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శనివారం ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకూ అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర మొదలవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ప్రధానికి ఖర్గే లేఖ
మరోవైపు, మన్మోహన్ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharghe) ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దీనిపై ఉదయం ఫోన్‌లో మాట్లాడిన ఖర్గే.. తాజాగా 2 పేజీల లేఖ రాశారు. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానమంత్రులకు అంత్యక్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవని అన్నారు.
మన్మోహన్ మరణంపై సీడబ్ల్యూసీ సంతాపం
మన్మోహన్ మరణంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సంతాపం తెలిపింది. ఆయన ఆశయాలను, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని తీర్మానం చేసింది. మన్మోహన్ నిజమైన రాజనీతిజ్ఞుడని, దేశం కోసమే జీవితాన్ని ధారపోశారని గుర్తు చేసుకుంది. ఆయన వారసత్వం ఎప్పటికీ జీవించే ఉంటుందని.. దేశాభివృద్ధి కోసం అందర్నీ ప్రేరేపిస్తుందని సీడబ్ల్యూసీ పేర్కొంది. నాయకుడిగా, ఆర్థికవేత్తగా, నిరాడంబర వ్యక్తిగా మన్మోహన్ జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు.
'మార్గదర్శకుడిని కోల్పోయా'
అటు, మాజీ ప్రధాని మన్మోహన్ మరణం పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకానికి, వినయానికి ప్రతిరూపమైన ఓ గొప్ప నాయకుడిని, మార్గనిర్దేశకుడిని పార్టీ కోల్పోయిందన్నారు. మన్మోహన్ దూరదృష్టితో దేశంలోని లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు విరిశాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప రాజనీతిజ్ఞుడిగా మన్ననలు పొందారని గుర్తు చేసుకున్నారు. ఆయన విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో దృఢ నిశ్చయంతో ఉండేవారని తెలిపారు. ఆయన లేని లోటు పార్టీకి, దేశానికి పూడ్చలేనిదని వ్యక్తిగతంగా తాను ఓ స్నేహితుడిని, మార్గదర్శకుడిని కోల్పోయానని సోనియా భావోద్వేగానికి గురయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

