TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
TGSRTC Medaram Prasadam: ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క , సారలమ్మ జాతర. అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతరను దర్శించుకోలేని భక్తులకు తెలంగాణ ఆర్టీసీ స్వీట్ న్యూస్ చెప్పింది.

TGSRTC Medaram Prasadam: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా మేడారం జాతరను జరిపించేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆలయాన్ని కనివినీ ఎరుగని రీతిలో మేడారం జాతరకు ఆలయాన్ని అభివృద్ది చేయడంతోపాటు, ఒకేసారి పదివేల మంది భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునే విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టింది.
కోటిన్నరకు పైగా ఈ ఏడాది మేడారం జాతరకు భక్తులు తరలిరానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చేవారితోపాటు, తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలను నుంచి సైతం మేడారం వేడుకను దర్శించుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అయితే ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి, మీ ఇంటి వద్దకు మేడారం అమ్మవారి ప్రసాదం అందించేందుకు సిద్దమైంది. నాలుగు రోజులు మాత్రమే ఈ జాతర కొనసాగుతుంది కాబట్టి, భక్తులు అనివార్య కారణాల వల్ల మేడారం జాతరకు వెళ్లలేకపోవచ్చు, అటువంటి భక్తుల కోసం నేరుగా వారి ఇంటికే మేడారం అమ్మవారి జాతర ప్రసాదం అందించేలా సరికొత్త ఆర్టీసీ సేవలకు శ్రీకారం చుట్టింది టీజీఎస్ఆర్టీసీ.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన "సమ్మక్క సారలమ్మ జాతర’’ ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు ప్రతీ ఒక్కరూ అమ్మవారికి బంగారం ప్రసాదం సమర్పించి మొక్కులు తీర్చుకోవడం దశాబ్దాల కాలంగా ఓ ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జాతరలకు వెళ్లలేకపోయినా, అమ్మవార్లకు బంగారం సమర్పించాలనుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఈ ప్రత్యేక సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.
ములుగు (వరంగల్) జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ దేవతలను పూజించడానికి తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. వచ్చిన ప్రతీ ఒక్కరూ బంగారం ప్రసాదం సమర్పిచకుండా వెళ్లరు. అమ్మవారి దర్శనం ఎంతలా ప్రాధాన్యత సంతరించుకుందో, అంతే స్టాయిలో అమ్మవారికి సమర్పించే బంగారం ప్రసాదం కూడా అంతే స్టాయిలో పవిత్రమైనదిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ నేపధ్యంలో మేడారంకు వెళ్లలేని భక్తులకు అంతటి పవిత్రమైన బంగారం ప్రసాదం నేరుగా భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసింది. దేవాదాయశాఖ సహకారంతో, మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్ల రూపంలో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయబోతోంది.
ఈ బంగారం ప్రసాదం ప్యాకెట్ నేరుగా మేడారం జాతర నుండి మీ ఇంటికే డోర్ డెలివరీ పొందాలనుకునే భక్తులు కేవలం రూ.299/- చెల్లించాల్సి ఉంటుంది.

మేడారం నుంచి అమ్మవారి బంగారం ప్రసాదం ఎలా బుక్ చేసుకోవాలంటే...
మొదట www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440069, 040-23450033 నెంబర్లలను సైతం సంప్రదించి, సమక్క సారలమ్మ అమ్మవార్ల అనుగ్రహం ప్రసాదం రూపంలో నేరుగా ఇంటి వద్దనే పొందవచ్చు.





















