Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
క్రికెట్లో మూడు ఫార్మాట్లున్న టెస్టులను అసలైన ఆటగా అభివర్ణిస్తారు. ఓపిక, టెక్నిక్, టెంపర్మెంట్లకు పరీక్ష పెట్టే టెస్టుల్లో ఈ ఏడాది చాలామంది ఆటగాళ్లు సత్తా చాటారు.
Sports Year Ender 2024: చూస్తుండగానే 2024 ఆఖరువారంలోకి వచ్చేశాం. ఈ ఏడాదిలో చాలా టెస్టులు జరిగాయి. చాలామంది ఆటగాళ్లు తమకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుని సత్తా చాటారు. అయితే అంచనాలకు అందుకోలేక కొంతమంది చతికిల పడ్డారు. అయితే ఈ ఏడాది టెస్టుల్లో సత్తా చాటిన పదకొండు మందిని ఎంపిక చేసి, వారితో ఒక ప్లేయింగ్ లెవన్ తయారు చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు కథనంలో తెలుసుకుందాం..
ఓపెనర్లుగా జైస్వాల్, డకెట్
నిజంగా ఈ ఏడాది భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ నామ సంవత్సరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 22 ఏళ్ల ప్రాయంలో అదరగొట్టే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. పెర్త్ లాంటి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పిచ్ పై కంగారూ బౌలర్లను ఎదుర్కొని భారీ సెంచరీ చేసి సత్తా చాటాడు. మొత్తానికి ఈ ఏడాది జైస్వాల్ 14 టెస్టుల్లో 52కి పైగా సగటుతో 1312 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ ను జైస్వాల్ కు జోడీగా మరో ఓపెనర్ గా తీసుకోవచ్చు. అతను 16 మ్యాచ్ ల్లో 1065 పరుగులతో దుమ్ము రేపాడు. ఇక వన్ డౌన్ లో ఇంగ్లాండ్ కే చెందిన జో రూట్, నాలుగో స్థానంలో హ్యారీ బ్రూక్, ఐదో స్థానంలో ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)లను ఎంపిక చేయవచ్చు. ఈ ఏడాది రూట్.. 17 టెస్టుల్లో 56కిపైగా సగటుతో 1556 రన్స్ సాధించాడు. అలాగే బౌలింగ్ లోనూ ఒక చేయి వేసి, 11 వికెట్లు తీశాడు. ఇక బ్రూక్ 12 టెస్టుల్లో 55కిపైగా సగటుతో 1100 పరుగులు చేశాడు. చాలాకాలం తర్వాత ట్రిపుల్ సెంచరీ మజాని అభిమానులకు అందించాడు. ఇక హెడ్.. 8 మ్యాచ్ ల్లో 607 పరుగులు చేశాడు. అలాగే 3 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
బూమ్ బూమ్ బుమ్రా..
ఇక లోయర్ మిడిలార్డర్ లో కమెందు మెండిస్ (శ్రీలంక), వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలకు స్థానం కల్పించవచ్చు. వీరంతా మిడిలార్డర్లో జట్టుకు బ్యాటింగ్ లో స్థిరత్వం తీసుకొస్తారు. ఇక బౌలర్ల విషయానికొస్తే భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ప్రధాన బౌలర్ గా బరిలోకి దింపవచ్చు. తను ఈ ఏడాది 12 టెస్టుల్లోనే 14 సగటుతో 62 వికెట్లు తీశాడు. అలాగే అతని సహచరులుగా ఇంగ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్, మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్)లను తీసుకోవచ్చు. 11 టెస్టుల్లో 52 వికెట్లు తీయడంతోపాటు 352 పరుగులతో అట్కిన్సన్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. అలాగే కేవలం 9 మ్యాచ్ ల్లోనే 48 వికెట్లను హెన్రీ తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా, మెండిస్ లను స్పిన్నర్లుగా వాడుకోవచ్చు.
2024 అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్, కమెందు మెండిస్, మహ్మద్ రిజ్వాన్, రవీంద్ర జడేజా, గస్ అట్కిసన్, జస్ప్రీత్ బుమ్రా , మాట్ హెన్రీ.
Also Read: Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?