Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Rohit Sharma: అటు బ్యాటింగ్, ఇటు కెప్టెన్సీలో విఫలమవుతున్న రోహిత్.. జట్టుకు భారంగా మారాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ వైఫల్యాలు మాజీలు ఎండగట్టారు.
Melbourne Test Updates: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ఆసీస్ టెయిలెండర్లను త్వరగా ఔట్ చేయడంలో విఫలమై ఏకంగా 175 పరుగులు సమర్పించుకోవడంపై సోషల్ మీడియాలో వాడి వేడి చర్చ జరుగుతోంది. మరోవైపు మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, రవి శాస్త్రి కూడా రోహిత్ కెప్టెన్సీ లోపాలపై చర్చించారు. శుక్రవారం రెండోరోజు త్వరగా ఆసీస్ ను ఆలౌట్ చేయలేక పోయారని, ఇది బౌలర్ల వైఫల్యమని, సరైన సమయంలో బౌలర్లను మార్చడంలో రోహిత్ విఫలమయ్యాడని గావస్కర్ చెప్పుకొచ్చాడు.
బుమ్రాతో ప్రారంభించాల్సింది..
నిజానిక రెండో రోజు ఆటను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ప్రారంభించాల్సిందని గావస్కర్ అభిప్రాయ పడ్డాడు. అతనైతే మరింత ఎఫెక్టివ్ గా ఉండేదని, మహ్మద్ సిరాజ్ తో బౌలింగ్ చేయించడాన్ని తప్పుపట్టాడు. ఇది రోహిత్, కోచ్ గౌతం గంభీర్ల వ్యూహ లేమికి నిదర్శనంగా కనిపిస్తోందని తెలిపాడు. మరోవైపు కొత్తబంతిని భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోలేక పోయారని మండిపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు కనీసం బౌన్సర్లను హెల్మెట్ వరకు విసరలేక పోయారని, నడుం ఎత్తు వరకు రావడంతోనే బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపాడు. ఇక, ఆకాశ్ దీప్ పదే పదే ఆఫ్ స్టంప్ కు చాలా దూరంగా బంతులు విసిర కొత్త బంతని వేస్ట్ చేశాడని తెలిపాడు. ఇక ఫీల్డర్ల ప్లేస్మెంట్ పై రవి శాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. నెం.9లో బ్యాటింగ్ చేసే మిషెల్ స్టార్క్ కోసం లాంగాఫ్, లాంగాన్ లను ఉంచడంలో అర్థం లేదని పేర్కొన్నాడు. అలాగే ఫీల్డింగ్ లో భారత ప్లేయర్లు చాలా సాధారణంగా ఉన్నారని పేర్కొన్నాడు.
సిడ్నీ టెస్టే రోహిత్ కు ఆఖరు..!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమవుతున్న రోహిత్ పై అన్ని వైపుల విమర్శల బాణాలు వస్తున్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్టులాడిన రోహిత్.. ఐదు ఇన్నింగ్స్ కలిపి కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బాక్సింగ్ డే టెస్టులో ఏరి కోరి ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన రోహిత్.. పేలవమైన షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఫుల్ షాట్లు అద్భుతంగా ఆడే రోహిత్, ఇప్పడు ఆ షాట్ కే తన వికెట్ పారేసుకున్నాడు. బ్యాటింగ్ కు అనుకూలమైన వికెట్ పై రోహిత్ ఇలా విఫలం కావడం ఏంటని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఫల్యాలు ఇలాగే కొనసాగితే, వచ్చే జనవరి 3న జరిగే సిడ్నీ టెస్టు ఆఖరుదయ్యే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెల్ బోర్న్ టెస్టులో మరో ఇన్నింగ్స్, సిడ్నీలో రెండు ఇన్నింగ్స్ అందుబాటులో ఉంటాయని, అందులో సత్తా చాటకపోతే హిట్ మ్యాన్ టెస్టు కెరీర్ అంతమైనట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. 38 ఏళ్ల రోహిత్.. గత కొంతకాలంగా బ్యాటింగ్ లో విఫలమవుతున్నాడు. ఇక తాజా సిరీస్ లో అతని కెప్టెన్సీలో లోపాలు కూడా కనిపించాయి. దీంతో అతను రిటైర్మెంట్ ప్రకటించాలని అన్ని వైపులా డిమాండ్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి.