Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
Khan Sir : ఫైజల్ ఖాన్ ఛానెల్ దాదాపు 24 మిలియన్ల మంది సబ్ స్ర్కైబర్స్ ను కలిగి ఉంది. ఇందులో దాదాపు 400 వీడియోలన్నాయి. ఇది వర్తమాన వ్యవహారాల నుండి రాజకీయాల వరకు అనేక విషయాలను కవర్ చేస్తుంది.

Khan Sir : బీహార్ లో 70వ బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాట్నాలోని గార్ద్నీబాగ్‌లో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీపీఎస్సీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల సమ్మెకు మద్దతుగా నిలిచిన ప్రముఖ కోచింగ్ టీచర్ ఖాన్ సార్ ఇప్పుడు పూర్తిగా విద్యార్థుల తరపున పోరాడుతున్నారు..
పరీక్షల కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ బీపీఎస్సీ అభ్యర్థులు పాట్నాలో నిరసన చేపట్టారు. ముఖ్యంగా, రాబోయే పరీక్ష కోసం BPSC ప్రకటించిన 'సాధారణీకరణ ప్రక్రియ(normalisation process)'పై విద్యార్థులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన్న ఖాన్ సార్.. విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
బీపీఎస్సీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తా- ఖాన్ సార్
శుక్రవారం గార్డినీబాగ్ నిరసన స్థలానికి చేరుకున్న ఖాన్ సార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ బీపీఎస్సీతో పోరాటం కొనసాగుతుందన్నారు. విద్యార్థులు విరాళాలు ఇవ్వాల్సి వచ్చినా మా డిమాండ్ నెరవేరే వరకు దీన్ని కొనసాగిస్తాం. అవసరమైతే తన కిడ్నీ కూడా అమ్మేస్తానని, తన పోరాటం కొనసాగిస్తానని ఖాన్ సార్ చెప్పారు. కిడ్నీ అమ్మి బీపీఎస్సీపై పోరాటం చేస్తానని, కానీ తలొగ్గబోనని చెప్పారు. బీపీఎస్సీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళతానని ఖాన్ సార్ చెప్పారు.
ఖాన్ సార్ నేపథ్యం
ఈ పోరాటంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఖాన్ సార్. ఈ మధ్య కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) అభ్యర్థుల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎత్తిచూపుతూ పాట్నాలో నిరసనలు చెలరేగాయి. నిరసనలకు మద్దతు ఇస్తోన్న వారిలో ఖాన్ సార్ ఒకరు. అసలు ఇంతకీ ఎవరు ఈ ఖాన్ సార్, అతని నేపథ్యం ఏంటీ అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ విద్యావేత్త, యూట్యూబర్‌గా పేరు గాంచిన 'ఖాన్ సార్' అసలు పేరు ఫైజల్ ఖాన్. ఆయనో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. పోటీ పరీక్షలకు సరసమైన కోచింగ్‌ను కోరుకునే చాలా మంది విద్యార్థులకు ఆయన వాయిస్ ఇస్తారు. అతని ఛానెల్ పేరు ఖాన్ GS రీసెర్చ్ సెంటర్ (Khan GS Research Centre). ఈ ఛానెల్ కు దాదాపు 24 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఈ ఛానెల్ లో ఆయన దాదాపు 400 వీడియోలను అప్ లోడ్ చేశారు. ప్రస్తుత వ్యవహారాలు, రాజకీయాల నుండి గణిత శాస్త్రం వరకు అనేక విషయాలను ఈ ఛానెల్ కవర్ చేస్తుంది.
ఖాన్ విద్యావ్యాప్తి కేవలం డిజిటల్ స్పేస్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అతను పాట్నాలో కోచింగ్ సెంటర్‌ను కూడా నడుపుతున్నాడు, వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంలో సహాయం చేస్తున్నాడు. ఫైజల్ అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. అతని బోధనా శైలి, అంకితభావం అతనికి నిబద్ధత కలిగిన విద్యావేత్తగా పేరు తెచ్చిపెట్టాయి.
ఫైజల్ ఖాన్ యూట్యూబ్ వీడియోల ద్వారా తన ప్రయాణాన్ని, అభ్యాసాన్ని పంచుకుంటూ, తక్కువ ప్రాధాన్యత ఉన్న నేపథ్యాల నుండి విద్యార్థులకు సమగ్ర కోచింగ్, వ్యక్తిగత మార్గదర్శకత్వం, వినూత్న బోధనా పద్ధతులను అందించడానికి ఖాన్ గ్లోబల్ స్టడీస్‌ను ప్రారంభించాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా సరసమైన, నాణ్యమైన, వినూత్నమైన విద్యను అందించడం అతని సంస్థల లక్ష్యం. ఖాన్ గ్లోబల్ స్టడీస్ ఇప్పుడు పాట్నా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, డెహ్రాడూన్‌లలో సెంటర్స్ ను కలిగి ఉంది.
పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్
అభ్యర్థులందరికీ డిసెంబర్ 13న జరిగిన 70వ BPSC పరీక్షను తిరిగి నిర్వహించాలని నిరసన తెలిపిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీపీఎస్సీ మాత్రం కేవలం బాపు సెంటర్ పాట్నాలో మాత్రమే రిగ్గింగ్ జరిగిందని, అందుకే ఆ పరీక్షను జనవరి 4వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని చెబుతోంది. దీంతో అభ్యర్థులు గార్డ్నిబాగ్‌లో నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో పలువురు అభ్యర్థుల ఆరోగ్యం కూడా క్షీణించింది. కొందరు అభ్యర్థులు ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది, అయినప్పటికీ విద్యార్థులు తమ డిమాండ్లపై దృఢంగానే ఉన్నారు. ఇకపోతే అభ్యర్థులకు బీహార్‌లోని అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

