Maa Amma Satyavathi: ‘మా అమ్మ సత్యవతి’ సాంగ్ - ఇది అమ్మ ప్రేమను గుర్తుచేసే అద్భుతమైన పాట, కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం
Maa Amma Satyavathi: అమ్మ ప్రేమ గురించి చెప్పడానికి ఇప్పటికే తెలుగులో ఎన్నో పాటలు ఉండగా అందులో మరో అద్భుతమైన పాట కూడా యాడ్ అయ్యింది. అదే ‘మా అమ్మ సత్యవతి’.
Maa Amma Satyavathi Song: అమ్మ గురించి ఎవరు ఎంత చెప్పినా, ఆమె ప్రేమను ఎన్ని విధాలుగా వర్ణించినా తక్కువే. అందుకే అమ్మ గురించి వచ్చే పాటలన్నీ ఇన్‌స్టంట్‌గా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయి. అలాంటి అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి వర్ణిస్తూ ఎన్నో తెలుగు పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరో పాట యాడ్ అయ్యింది. అదే ‘మా అమ్మ సత్యవతి’. మయూక్ వెలగపూడి పాడిన ఈ పాట.. ఇటీవల విడుదలయ్యింది. ప్రస్తుతం తెలుగులో ఆల్బమ్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుండగా అమ్మ గురించి వచ్చిన ఆల్బమ్ సాంగ్స్ కూడా హిట్ అవుతున్నాయి. ఇక ‘మా అమ్మ సత్యవతి’ కూడా ఆ లిస్ట్‌లో చేరింది.
అమ్మ ప్రేమకు పోలికలు..
‘మా అమ్మ సత్యవతి’ పాట వినడానికి మాత్రమే కాదు.. లిరికల్ వీడియో కూడా చూడడానికి చాలా బాగుంది. అయితే ఈ లిరికల్ వీడియోలో నటీనటులు ఎవరూ లేరు. కేవలం యానిమేషన్(AI)తోనే వీడియో మొత్తం నడిపించారు. పాట ప్రారంభమయిన చాలాసేపటి వరకు లిరిక్స్‌తో కాకుండా తన మ్యూజిక్‌తోనే ప్రేక్షకులను అందులో లీనమయ్యేలా చేశారు మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్. ముందుగా తల్లి ప్రేమను మంచుతో పోలుస్తూ పాట మొదలవుతుంది. ‘‘మంచు కన్నా చల్లనిది అమ్మ ప్రేమ ఒక్కటే. మల్లె కన్న తెల్లనిది అమ్మ ప్రేమ ఒక్కటే’’ అంటూ అమ్మ ప్రేమను పోలుస్తూ లిరిక్స్‌ను అందించారు కోనల కాళి కృష్ణ. ఈ పాటలో సంగీతం ప్రేక్షకులను ఎంతగా ఇంప్రెస్ చేసిందో లిరిక్స్ కూడా అందరినీ అంతే ఆకట్టుకునేలా ఉన్నాయి.
లిరిక్స్‌లో అమ్మ ప్రేమ..
ఈ పాటలోని లిరిక్స్.. ప్రేక్షకుల చిన్నతనాన్ని కూడా గుర్తుచేసేలా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. చిన్నప్పుడు ఇంట్లో అల్లరి చేసినప్పుడు, వంటగది నుండి చిల్లర దొంగతనం చేసినప్పుడు అమ్మ ఎలా కోప్పడేది.. తినకుండా పడుకుంటే ఎలా గోరుముద్దలు పెట్టేది అని పాటలో చక్కగా వర్ణించారు. అలా పాటలో అమ్మతో పాటు పిల్లల ఎమోషన్స్‌ను కూడా బాగా మిక్స్ చేశారు కోనల కృష్ణ. పిల్లలను అమ్మ ఎలా కాపాడుకుంటుంది అని చెప్తూ ఎమోషనల్ చేసేశారని లిరిసిస్ట్ కృష్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. మొత్తానికి 4 నిమిషాల 30 సెకండ్ల వీడియోతో అద్భుతమైన పాటను అందించారని వారు అంటున్నారు. ఆగస్టులో పుల్ వీడియో సాంగ్ రిలీజ్ కానున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.
వాయిస్ హైలెట్..
తల్లి, బిడ్డలకు సంబంధించిన ఏఐ ఫోటోలను మాత్రమే ఉపయోగిస్తూ ‘మా అమ్మ సత్యవతి’ లిరికల్ వీడియోను అందంగా ఎడిట్ చేశారు రాజేశ్ బోనం. ఈ పాటకు హై క్వాలిటీ సౌండ్ డిజైనింగ్‌ను అందించిన విషయంలో నిర్మాత దివ్య జ్యోతికే క్రెడిట్ దక్కుతుంది. తన సొంత బ్యానర్ అయిన దివ్య జ్యోతి ప్రొడక్షన్స్‌లో ఈ లిరికల్ వీడియోను నిర్మించారు. పాట బాధ్యతలు కూడా మొత్తం ఆమె తీసుకున్నారు. అలా సాంగ్ ఔట్‌పుట్ చాలా బాగుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లవాడు అయినా కూడా మయూక్ వెలగపూడి స్వరం తమల్ని ఎమోషనల్ చేసేస్తుందని అంటున్నారు. మొత్తానికి మయూక్ వాయిస్, కృష్ణ లిరిక్స్‌తో అమ్మ పాట బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.