Maa Kaali Telugu Teaser: ‘మా కాళి’ టీజర్: మతం మారితేనే బ్రతుకు, లేకపోతే చావు - ఆగస్టు 16, డైరెక్ట్ యాక్షన్ డే వెనుక ఇంత కథ ఉందా?
Maa Kaali Teaser: ఇప్పటికే ‘కశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ చిత్రాలు ఎవరికీ తెలియని సంచలన నిజాలు బయటపెట్టాయి. అదే తరహాలో ‘మా కాళి’.. ఒకప్పటి బెంగాల్ పరిస్థితులను ప్రేక్షకులకు తెలియడానికి వచ్చేస్తుంది.
Maa Kaali Teaser Out Now: ఒకప్పుడు యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించాలంటే మేకర్స్ చాలా ఆలోచించేవారు. ఆ సినిమా చుట్టూ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని, రిలీజ్ ఆగిపోతుందని భయపడేవారు. కానీ ఓటీటీ అనేది వచ్చిన తర్వాత థియేటర్లలో విడుదల కాకపోతే సినిమాను నేరుగా ఓటీటీలో అయినా విడుదల చేస్తామని చాలా బోల్డ్ కంటెంట్‌తో ముందుకొస్తున్నారు మేకర్స్. అలాంటి మరొక బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘మా కాళి’. స్వాతంత్ర్యం సమయంలో బెంగాల్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది.
హిందుస్థాన్ ఉండదు..
1946లో బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో ‘మా కాళి’ టీజర్ మొదలవుతుంది. ‘‘మనం 500 ఏళ్ల పాటు హిందువుల మీద అధికారం చలాయించాం. మరి ఇప్పుడు వాళ్ల అధికారంలో మనం ఉందామా’’ అంటూ ఒక ముస్లిం వ్యక్తి ప్రశ్నిస్తాడు. దీంతో ‘‘ఇప్పటినుండి హిందుస్థాన్ ఉండదు, పాకిస్థాన్ మాత్రమే ఉంటుంది’’ అంటూ ప్రజలంతా నినాదాలు చేస్తుంటారు. ‘‘హిందుస్థాన్‌కు అధికారం బదిలీ చేయాలని బ్రిటీష్ సర్కార్ నిర్ణయించింది. హిందువులు అఖండ భారత్ కోసం పగటి కలలు కంటున్నారు’’ అంటూ హిందూ ముస్లిం విభేదాలను రెచ్చగొడతాడు ఆ దేశ ప్రధాన మంత్రి. అదే సమయంలో అక్కడ సంతోషంగా ఉంటున్న రైమా సేన్ ఫ్యామిలీ చూపిస్తారు.
పాకిస్థాన్ గడ్డ..
‘‘బెంగాల్ ప్రధానమంత్రిగా హుసేన్ షాహేద్ సురావర్తి అనే నేను.. జిన్నా సాబ్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 16ను డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ప్రకటిస్తాడు. దీంతో ముస్లిం కమ్యూనిటీ అంతా ఒక్కటవుతుంది. హిందువులను విచక్షణ లేకుండా చంపడం మొదలుపెడతారు. ‘‘అల్లా మనతోనే ఉన్నాడు. ఈ గడ్డ పాకిస్థాన్ అయ్యి తీరుతుంది’’ అంటూ నినాదాలు చేస్తూ కంటికి కనిపించిన హిందువులను చంపుకుంటూ పోతారు. ఆ గొడవల్లో రైమా సేన్ కుటుంబానికి దిక్కుతోచదు. ఆ ఘర్షణల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ‘మా కాళి’ టీజర్ మొత్తం హిందువులపై ముస్లింలు చేసిన హింసను మాత్రమే చూపించారు దర్శకుడు విజయ్ యేలకంటి.
మతం మారాలి..
‘‘హిందువులకు వేరే దారి లేదు. మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు’’ అంటూ రైమా సేన్ చెప్పే డైలాగ్‌తో ‘మా కాళి’ టీజర్ ముగుస్తుంది. ఇండియా చీలిపోవడానికి గల కారణాలను ఈ సినిమాలో చూపిస్తామని టీజర్ మధ్యలో స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. నిజాన్ని బయటపెడతామని కూడా తెలిపారు. దీంతో ఇలాంటి బోల్డ్ కంటెంట్‌తో ముందుకొస్తున్నందుకు దర్శకుడు విజయ్ యేలకంటిని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, బెంగాలీలో కూడా విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్‌తోనే ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది ‘మా కాళి’. ‘కేరళ స్టోరీ’, ‘కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే ‘మా కాళి’ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ‘కల్కి 2898 AD’ టికెట్ రేట్లపై వివాదం ఎందుకు? విషయం కోర్టు వరకు ఎందుకెళ్లింది?