(Source: ECI/ABP News/ABP Majha)
Chiranjeevi: చిరంజీవి మంచి మనసు - ‘బలగం’ మొగిలయ్య కంటి చికిత్సకు సాయం
‘బలగం’ సినిమా క్లైమాక్స్ లో ‘తోడుగా మా తోడుండి’ పాట పాడిన మొగిలయ్య అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. వైద్యానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు.
నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ వచ్చిన ఈ మూవీ విడుదల తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా అంతే గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘తోడుగా మా తోడుండి’ అనే పాట పాడిన మొగిలయ్య దంపతులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలో ఆ పాట చూసి కన్నీళ్లు పెట్టని వారుండరు. మొగిలయ్య ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అతని రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు. వైద్యానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య దాతలను సాయం కోరింది. దీనిపై స్పందించిన చిరంజీవి ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవే ఖర్చు భరించారు: మొగిలయ్య దంపతులు
మొగిలయ్య కు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బీపీ, షుగర్ తో పాటు రెండు కిడ్నీలు పాడయ్యాయి. బీపీ పెరగడంతో కంటి చూపుపై ప్రభావం పడి చూపు మందగించింది. దానికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అయితే వైద్యానికి తమ వద్ద అంత డబ్బులేకపోవడంతో దాతలను సాయం కోరారు. దీనిపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. మొగిలయ్య కంటి ఆపరేషన్ కు ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని హామి ఇచ్చారు. ఈ మాటను దర్శకుడు వేణు కు ఫోన్ చేసి చెప్పారట చిరంజీవి. దీంతో చిరంజీవి సాయం చేస్తానని హామి ఇచ్చారని వేణు మొగిలయ్య దంపతులకు చెప్పారు. మొగిలయ్య గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసి చిరంజీవి పెద్ద మనసు పట్ల నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొగిలయ్యకు కొనసాగుతోన్న చికిత్స..
మొగిలయ్యకు ముందు నుంచీ ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో ఇటీవలె గుండెనొప్పి రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కిడ్నీలు కూడా బాగా పాడవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. మొగిలయ్య పరిస్థితి పై ఆయన భార్య ఆ వీడియోను చేసింది. తమను ఆదుకోవాలని దాతలను కోరింది. అయితే ఆయనకు గుండె సంబంధిత సమస్య ఏమీ లేదని నిమ్స్ వైద్యులు తెలిపారు. అన్ని రకాల పరీక్షలు చేసిన నిమ్స్ వైద్యులు ఆయనకు ఎలాంటి గుండె సమస్య లేదని చెప్పారు. ఆయనకు ప్రస్తుతం డయాలసిస్ కంటిన్యూ అవుతుందని, ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు తెలిపారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తో పాటు తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఇతర మంత్రులు కూడా మొగిలయ్యకు అండగా నిలబడ్డారు. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంద్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి మొగిలయ్యను పరామర్శించారు. మొగిలయ్య చికిత్సకు అయ్యే ఖర్చులు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని హామి ఇచ్చారు.
Also Read : హైదరాబాదుకు జాను వచ్చిందిరోయ్ - ఎన్టీఆర్ 30 కోసమే!