Kantara for Oscars: ఆస్కార్‌కు ‘కాంతార’? రిషబ్ శెట్టి స్పందన ఇదే
కాంతార సినిమా భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అభిమానులు సొంతం అయ్యారు. దీంతో ఈ సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారట.
నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతార' సినిమా ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కన్నడ లో విడుదల అయిన ఈ సినిమా అక్కడ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదల చేసింది మూవీ టీమ్. విడుదల అయిన అన్ని భాషల్లోనూ కాంతార సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కొత్త వార్త ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కాంతార సినిమా భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అభిమానులు సొంతం అయ్యారు. దీంతో ఈ సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారట.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రిషబ్ శెట్టి దానిపై స్పందించారు. ఈ సినిమా తీస్తున్నప్పుడు హిట్ కోసం తీయలేదని పని కోసం ఈ పని చేశానని వ్యాఖ్యానించారు. మంచి సినిమా తీయాలనే లక్ష్యంతోనే తాను పనిచేస్తానని అన్నారు. అయితే ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ చేయాలనే డిమాండ్ పై తాను ఆలోచించ లేదని, ఇలాంటి డిమాండ్ల పై స్పందించడం తనకు అంతగా ఇష్టం లేదని అన్నారు. ఇలాంటి డిమాండ్ గురించి తాను సుమారు 25 వేల ట్వీట్స్ చూశానని, ఇది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, కానీ తాను దానిపై స్పందించనని పేర్కొన్నారు. ఏదేమైనా అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
అలాగే ఈ సినిమా రీమేక్ గురించి మాట్లాడుతూ.. హిందీలో ఈ సినిమాకు న్యాయం చేయగల నటులు ఉన్నారని, అయితే రీమేక్ లు తనకు అంతగా నచ్చవని పేర్కొన్నారు. 'కాంతార' దర్శకుడే ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇక హిందీ లో ఈ సినిమా రీమేక్ అయ్యే అవకాశాలు లేవనే చెప్పొచ్చు. ఇటీవల ఇలాంటి రీమేక్ లు ఎక్కువగా చేస్తున్నారు. ఈ మధ్యనే మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమా తెలుగులో కూడా డబ్ అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి తెలుగులో 'గాడ్ ఫాదర్' గా రీమేక్ చేసి హిట్ టాక్ ను తెచ్చుకున్నారు. ఇప్పుడీ కాంతార సినిమా కూడా అలాంటి రీమేక్ వస్తుందేమో అనుకున్నారు. అయితే రిషబ్ వ్యాఖ్యలతో అది జరగకపోవచ్చు అని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా సీక్వెల్ గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా తరువాత ఇంకో సినిమా గురించి ఆలోచించలేదని, ఇకపై సినిమాలు అన్ని కాంతార స్థాయిలోనే తీస్తానని అన్నారు. అయితే కేజీఎఫ్ లాంటి సినిమాలు హిట్ అవ్వడంతో సీక్వెల్ కూడా తీశారు. అలాగే ఈ సినిమా కూడా భారీ హిట్ కావడంతో సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాల టాక్. ప్రస్తుతం సినిమా భారీ వసూళ్లు సాధిస్తోన్న నేపథ్యంలో దీనిపై రిషబ్ శెట్టి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. ఇక 'కాంతార' సినిమా కన్నడ తో పాటు ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. హిందీలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. అక్కడ పబ్లిసిటీ చేయకపోయినా మౌత్ టాక్ తో మంచి వసూళ్ళు సాధిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే హిందీ లో కార్తికేయ 2 వసూళ్లను కూడా బ్రేక్ చేస్తుందని ఫిల్మ్ వర్గాల టాక్. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.
Also Read : ఈ వారం చిన్న సినిమాలదే హవా - థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్ ఇవే!