Bimbisara Making Video: ‘బింబిసార’లోని ఆ సీన్స్ కోసం ఇంత కష్టపడ్డారా?
‘బింబిసార’ మేకింగ్ వీడియోలో కొన్ని పోరాట సన్నివేశాలను ఏ విధంగా చిత్రీకరించారో చూపించారు. ఈ వీడియోను చూస్తే ఆ సినిమా తీసేందుకు వారు పడ్డ కష్టం ఏమిటో అర్థమవుతుంది.
బింబిసార.. గత కొంత కాలంగా సరైన హిట్ లేక విలవిలలాడుతున్న తెలుగు సినిమా పరిశ్రమకు కొత్తఊపు తీసుకొచ్చిన చిత్రం. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షాన్ని కురిపించిన మూవీ. నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్మురేపుతూ దూసుకెళ్తోంది. ఆగష్టు 5న జనాల ముందుకు వచ్చిన ఈ సోషియో ఫాంటసీ మూవీ తొలి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. జనాల నుంచి వస్తున్న పాజిటివ్ రియాక్షన్ తో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ‘బింబిసార’ సినిమాతో కల్యాణ్ రామ్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. చాలా రోజులుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న కల్యాణ్ రామ్‌కు ఈ చిత్రం ఊరటనిచ్చింది. ‘బింబిసార’ సినిమాలో కల్యాణ్ డ్యూయెల్ రోల్ చేసి వారెవ్వా అనిపించారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా అద్భుత నటన కనబర్చారు.
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వెండి తెరమీద దర్శనం ఇచ్చిన కల్యాణ్ రామ్.. ‘బింబిసార’ సినిమాతో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతున్నారు. ఈ సినిమా విడుదలై 10 రోజులు దాటినా ఇప్పటికీ వసూళ్ల వరద పారుతూనే ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ‘ది క్రానికల్స్ ఆఫ్ బింబిసార’ పేరుతో ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
‘బింబిసార’ మేకింగ్ వీడియోలో ప్రధానంగా ఫైట్స్ ఎలా చిత్రీకరించారో చూపించారు. ఒక్కో సీన్ ను ఎంతో కష్టపడి తీసినట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. అద్భుతమైన సెట్ ను నిర్మించడంతో పాటు అందులో చిత్రీకరణ ఎలా జరిపారో ఈ వీడియోలో కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రతి సీన్ అద్భుతంగా వచ్చేందుకు కల్యాణ్ రామ్ ఎంతో కష్టపడ్డట్లు ఈ వీడియోలో చూపించారు. పోరాట సన్నివేశాలు, హీరో పరిగెత్తే విజువల్స్, హీరోయిన్ అందచందాలను ఈ వీడియోలో చూపించారు.
‘బింబిసార’ సినిమాకు ఎంఎం కీరవాణి అద్భుత సంగీతం అందించగా.. చోటా కె. నాయుడు అదిరిపోయే సినిమాటోగ్రఫీతో సినిమాను మరో రేంజికి తీసుకెళ్లాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ ఈ సినిమాను నిర్మించాడు. కల్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
‘బింబిసార’ సినిమాతో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తనను తాను ఫ్రూవ్ చేసుకున్నాడు. పది రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా సుమారు రూ.14 కోట్లు సాధించింది. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని సినీ పెద్దలు అంచనా వేస్తున్నారు.
Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?