Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
బ్రహ్మాజీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనది ప్రేమ వివాహం అని, కానీ తాను ప్రేమించిన అమ్మాయికి అప్పటికే పెళ్లై, ఒక బాబు కూడా ఉన్నాడన్నారు.
బ్రహ్మాజీ.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అవసరం లేని నటుడు. విలనిజమ్, కామెడీ క్యారెక్టర్.. ఏదైనా సరే అద్భుతంగా పరకాయ ప్రవేశం చేసే గొప్ప నటుడు. ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బ్రహ్మాజీని తెలుగు సినీ అభిమానులు తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారంటే ఆయన నటనలోని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సీనియర్ నటుడు ఇంతకాలం ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ను తాజాగా బయటకు చెప్పారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
బ్రహ్మాజీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనది ప్రేమ వివాహం అని, కానీ తాను ప్రేమించిన అమ్మాయికి అప్పటికే పెళ్లై, ఒక బాబు కూడా ఉన్నాడని తెలిపారు. సినిమా అవకాశాల కోసం మద్రాసులో ఉన్నప్పుడు ఓ బెంగాలీ అమ్మాయి పరిచయం అయ్యిందని, ఆ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నారు.
‘‘వాస్తవానికి తనతో పెళ్లికి ముందే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లైంది. కానీ, అతడితో ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు ఓ బాబు కూడా ఉన్నాడు. మాకు పెళ్లైన తర్వాత ఆ బాబును సొంత కొడుకులా చూసుకుంటున్నా. అందుకే పెళ్లైయినా.. మళ్లీ పిల్లలు వద్దని నా భార్యతో చెప్పా’’ అని బ్రహ్మజీ తెలిపారు. ఆ బాబు ఇప్పుడు పెద్దవాడు అయ్యాడని, తాను నటించి ‘పిట్టకథ’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడన్నారు.
పెళ్లై విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకున్నా.. తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు రాలేదని బ్రహ్మాజీ వెల్లడించాడు. ఎంతో అన్యోన్యంగా తన సంసార జీవితం సాగుతోందన్నారు. అటు సినిమా జీవితంలోనూ తనకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు కలగలేదని చెప్పారు బ్రహ్మాజీ. చాలా మంది సినిమాల్లోకి వచ్చేందుకు చాలా పడతారని, తాను మాత్రం అలాంటి సమస్యలను ఎదుర్కోలేదన్నారు.
ఆంధ్రాలోని గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగానని, అప్పట్లోనే తనది కాస్త డబ్బున్న కుటుంబం అని అన్నారు. తన తండ్రి ఎమ్మార్వో అని, చదువు కంప్లీట్ అయ్యాక నటన పట్ల ఆసక్తిని ఆయనకు చెప్పానన్నారు. ఆ తర్వాత మద్రాసుకు వెళ్లి ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నానని పేర్కొన్నారు. అదే సమయంలో తనకు చాలా మంది నటులు, దర్శకులు పరిచయం అయినట్లు వెల్లడించాడు.
రవితేజ, కృష్ణవంశీ, రాజా రవీంద్ర సహా పలువురు అప్పుడే మిత్రులయ్యారని చెప్పారు. అంతేకాదు.. సినిమాల్లోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే మంచి గుర్తింపు సాధించినట్లు తెలిపారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు వచ్చిన క్యారెక్టర్లు మాత్రం తనకు పెద్దగా సంతోషాన్ని ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం తన సినిమా కెరీర్ చాలా చక్కగా ఉందన్నారు. గడిచిన కొంతకాలంగా మనసుకు నచ్చిన పాత్రలు వస్తున్నట్లు తెలిపారు. మంచి పేరు రావడమే కాకుండా.. నచ్చిన పాత్రలు చేశాననే సంతృప్తి మిగులుతుందని బ్రహ్మజీ పేర్కొన్నారు.
Also Read : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?