Jayalakshmi: కె.విశ్వనాథ్ భార్య జయలక్ష్మి కన్నుమూత - భర్త చనిపోయిన నెలలోనే గుండెపోటుతో!
ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి గుండెపోటుతో మరణించారు.
కళా తపస్వి కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి (88) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఈ రోజు సాయంత్రం 6.15కు జయలక్ష్మి మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం విశ్వనాథ్ పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు . ఆయన వచ్చాక జయలక్ష్మి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. విశ్వనాధ్ లాగే ఆయన సతీమణి జయలక్ష్మి నిద్రలోనే మరణించారని తెలుస్తోంది.
కె. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతి దేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. కె. విశ్వనాథ్ ఈ నెల ప్రారంభంలోనే మరణించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన చనిపోయారు. మరణించే నాటికి కె.విశ్వనాథ్ వయసు 92 సంవత్సరాలు.
విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విశ్వనాథ్ కూడా అందులో ఉద్యోగానికి వెళ్లారు.
సినిమాల్లో విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్ గా మొదలైంది. వాహిని స్టూడియోస్ లో ఆయన తొలి ఉద్యోగం అదే. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'పాతాళ భైరవి' చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.
'ఆత్మ గౌరవం' సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దానికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'చెల్లెలి కాపురం', 'శారదా', 'ఓ సీత కథ', 'జీవన జ్యోతి' చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి. నందులు అందుకున్న సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి.
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో 'శంకరాభరణం' ఒకటి. దానికి ఉత్తమ సినిమాగా నంది మాత్రమే కాదు... జాతీయ అవార్డు కూడా వచ్చింది. 'బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్' విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది. 'సప్తపది', 'స్వాతిముత్యం', 'సూత్రధారులు', 'స్వరాభిషేకం' సినిమాలకూ నేషనల్ అవార్డులు వచ్చాయి. 'స్వాతి ముత్యం' సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు.
చిత్రసీమకు విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఆయన్ను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలకూ ఆయన దర్శకత్వం వహించారు. 'శుభ సంకల్పం' సినిమాతో నటుడిగా మారిన ఆయన, ఆ తర్వాత పలు చిత్రాల్లో పాత్రలకు ప్రాణం పోశారు. విశ్వనాథ్ అనేది తెలుగు చిత్రసీమలో ఒక పేరు కాదు, చరిత్ర. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. ఎనిమిది సార్లు ఆయన ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. ఆయన్ను 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది.