(Source: Poll of Polls)
Jr NTR: ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు - ‘దేవర’ షూటింగ్ కారణంగా!
ఎన్టీఆర్ ముఖచిత్రం ఉన్న రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రం ఉన్న రూ.100 నాణేన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ‘దేవర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమే దీనికి కారణం అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్‌రామ్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. కల్యాణ్ రామ్ ఎందుకు వెళ్లలేదనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు.
ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఆహ్వానం అందిందని, ఆయన హాజరవుతారని కూడా సోషల్ మీడియాలో కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ అనుకోని విధంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మినహా నందమూరి కుటుంబం మొత్తం ఈ కుటుంబానికి హాజరయ్యారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న రూ. వంద నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు నందమూరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు సైతంఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘దేవర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నందున జూనియర్ ఎన్టీఆర్, ‘యువగళం’ పాదయాత్రలో ఉన్నందున నారా లోకేష్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ నందమూరి తారక రామారావు విశేష సేవలందించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలపైనా ఆయన ప్రభావం చూపించారని వెల్లడించారు.
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఫొటోతో రూ. 100 నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఒక వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో రాసి ఉంది. 2023 నందమూరి తారక రామారావుకు శతజయంతి సంవత్సరం. కాబట్టి 1923 - 2023 అని దీనిపై ముద్రితమై ఉంటుంది.
ఈ రూ.100 నాణెం విడుదల చేసిన తరవాత నందమూరి తారక రామారావు సేవలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఆయన పేరిట ఇలా ఒక నాణెం విడుదల చేయాలన్న ఆలోచన చాలా గొప్పదని అభిప్రాయపడ్డారు. కేవలం రాముడిగా మాత్రమే కాకుండా రావణుడిగా, దుర్యోధనుడిగానూ ఎన్‌టీఆర్ అందరినీ మెప్పించారని కొనియాడారు ఆయన కూతురు పురంధేశ్వరి. ఆయన తరతరాలకూ హీరో అని తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial