Pushpa Movie Story: ‘పుష్ప’ సినిమాకు ఈ వెబ్ సీరిసే ఆధారమా? ఇవిగో పోలికలు!
‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున తరహా పాత్ర.. కొలంబియా స్మగ్లర్ పాబ్లోను పోలీ ఉంటుంది. అతడిపై వచ్చిన వెబ్ సీరిస్ ‘నార్కోస్’ను చూస్తే.. మనకు ‘పుష్ప’ సినిమానే గుర్తుకొస్తుంది.
‘పుష్ప: ది రైజ్’.. బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఇది. ప్రస్తుతం అంతా ‘పుష్ప: ది రూల్’ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒక సినిమాకు కథను రాసుకోవడం, దాన్ని అనుకున్నట్లుగా తెరపైకి ఎక్కించడమంటే మాటలు కాదు. కానీ, అందుకే మన దర్శకులు, కథా రచయితలు హాలీవుడ్ లేదా కొరియా సినిమాల్లోని కొన్ని సీన్లు, కథల నుంచి స్ఫూర్తి పొందుతారు. అవి మన హీరోలకు సరిపోతాయంటే.. మన నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేసుకుని అన్ని హంగులతో ప్రేక్షకుల ముందుకు తెస్తారు. ప్రేక్షకులు కూడా అది కాపీ చిత్రమా? లేదా కొట్టేసిన సీన్లా అనే తేడా చూడరు. కేవలం వెబ్ సీరిస్, హాలీవుడ్ సినిమాలు అతిగా చూసే సినీ అభిమానులకు తప్ప మరెవ్వరు వాటిని గుర్తించలేదు. ఆ సీన్లను స్ఫూర్తితో తీస్తే తప్పులేదు. ఎందుకంటే.. అవి ప్రేక్షకుడికి వినోదాన్ని అందిస్తాయి.
మన టాలీవుడ్, బాలీవుడ్‌లో తెరకెక్కే ఎన్నో సినిమాలు హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందినవే. తాజాగా ‘పుష్ప’ సినీ సీరిస్ కూడా అలాంటిదే అనే టాక్ వినిపిస్తోంది. మొన్నటివరకు అది ‘కేజీఎఫ్’ సినిమాను పోలి ఉందని చాలామంది కామెంట్స్ చేశారు. కానీ, స్టోరీ లైన్ ఒకేలా ఉన్నా.. కథనం మాత్రం పూర్తి డిఫరెంట్. ఇతర సినిమాలతో తమ చిత్రాన్ని పోల్చకూడదనే ఉద్దేశంతో దర్శకుడు సుకుమార్ ఎంతో శ్రద్ధగా పాత్రలను తయారు చేసుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ను చాలా డిఫరెంట్ లుక్‌లో చూపిస్తూ.. అభిమానులను మెప్పించగలిగారు. అంతేకాదు, ఇందులో బన్నీ బాడీలాంగ్వేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. పైగా, ఆ కథను ఏపీ-తమిళనాడు బోర్డర్ మధ్యలో జరిగే వాస్తవ ఘటనలను, మనకు తెలియని స్మగ్లింగ్ అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. కొన్ని సీన్లయితే హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కళ్లలోనే కదులుతాయి.
2015లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజైన ‘నార్కోస్’ (Narcos) వెబ్ సీరిస్‌ను చూస్తే మీకు ‘పుష్ప’ సినిమా తప్పకుండా గుర్తుకొస్తుంది. ఈ వెబ్ సీరిస్‌కు, పుష్ప సినిమాకు మధ్య నేపథ్యంలో చాలా తేడా ఉంటుంది. ఈ వెబ్ సీరిస్ పాబ్లో ఎస్కోబార్ అనే డ్రగ్ లార్డ్ చుట్టూ తిరుగుతుంది. అంటే.. దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి అమెరికాకు డ్రగ్స్‌ను ఏ విధంగా స్మగ్లింగ్ చేశారనేది ఈ వెబ్ సీరిస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ‘పుష్ప’ కథ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది.
పుష్ప తరహాలోనే పాబ్లో:
పుష్ప సినిమాలో పుష్ప రాజ్ తరహాలోనే.. ‘నార్కోస్’ వెబ్ సీరిస్‌లో పాబ్లో పాత్ర కూడా ఉంటుంది. పాబ్లో మొదట్లో చిన్న స్మగ్లింగ్‌లు చేస్తుంటాడు. కాక్రోచ్ అనే వ్యక్తి నాణ్యమైన కొకైన్ తయారు చేయడంలో నేర్పరి. ఓ రోజు అతడి ముఠాను పోలీసులు చుట్టుముడతారు. డ్రగ్స్‌ను నిర్మూలించడం కోసం వారందరినీ పోలీసులు వరసపెట్టి కాల్చేస్తారు. కానీ, కాక్రోచ్ మాత్రం బతికిపోతాడు. కాక్రోచ్‌కు కొకైన్ తయారు చేయడం వచ్చు. కానీ, వాటిని విక్రయించడం, స్మగ్లింగ్ చేయడం రాదు. దీంతో పాబ్లోను కలిసి.. అగ్రీమెంట్ చేసుకుంటాడు. దాని ప్రకారం.. కాక్రోచ్ తయారు చేసే కొకైన్‌ను కొనుగోలు చేసి స్మగ్లింగ్ చేసుకొనే బాధ్యతలను పాబ్లో తీసుకుంటాడు. వాటిని ఎలా అమెరికాలోకి పంపిస్తాడనేది మీరు బుల్లితెరపైనే చూడాలి. ఇక పుష్పలో కూడా అలాంటి సీన్లే ఉంటాయి. ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి ‘పుష్ప’ వేసే ఎత్తులు ఆకట్టుకుంటాయి. బన్ని లుక్, పాబ్లో పాత్రదారుడి లక్ సేమ్ ఉంటాయి. పైగా ఈ సినిమాను కూడా 1984 బ్యాక్‌డ్రాప్‌లోనే తీశారు.
రాజకీయాల్లోకి పాబ్లో..:
కొకైన్ తదితర డ్రగ్స్‌ను అమ్మకాల వల్ల పాబ్లో చాలా తక్కువ రోజుల్లోనే బిలినియర్ అయిపోతాడు. ఆ డబ్బును ఎక్కడ దాయాలో తెలియక.. భూమిలోను, ఇళ్ల స్లాబ్‌లపైనా దాచిపెడుతుంటాడు. కొలంబియాలోని పేదలకు ఉచితంగా పంచిపెడతాడు. వాళ్ళకు ఇళ్లను కట్టిస్తాడు. దీంతో అక్కడి ప్రజలకు పాబ్లోపై అభిమానం కలుగుతుంది. అయితే, అక్కడి ప్రజలకు పాబ్లో కొకైన్ స్మగ్లర్ అనే విషయం తెలియదు. ప్రజలకు మంచి పనులు చేస్తున్నా కాబట్టి నేను రాజకీయాలకు అర్హుడినే అంటూ.. అటుగా అడుగు వేస్తాడు పాబ్లో. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఇక్కడ చెప్పేస్తే.. మీకు ఆ వెబ్ సీరిస్ మీద ఉండే ఆసక్తి తగ్గిపోతుంది.
పోలీస్ పాత్రలో కాస్త డిఫరెంట్:
ఈ కథ మొత్తాన్ని స్టీవ్ మార్ఫీ అనే డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ నరేట్ చేస్తాడు. పాబ్లో తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు. అతడిని పట్టుకోడానికి వేసిన ఎత్తుల గురించి చెబుతూ కథను చూపిస్తారు. పోలీస్ పాత్ర ‘పుష్ప’లో ఎస్పీ షెకావత్ అంత క్రూయెల్‌గా ఉండడు. చాలా కూల్‌గా ఉంటాడు. ఒక ధైర్యమైన పోలీస్ ఆఫీసర్‌గా పాబ్లో ఆటకట్టించే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇతడికి జావియర్ పెనా అనే మరో అధికారి సాయం చేస్తాడు. వారు వేసే ఎత్తులు కూడా బాగుంటాయి. పాబ్లో పాత్ర పూర్తిగా పుష్పరాజ్ తరహాలోనే ఉంటుంది. ధైర్యంగా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లడం, పోలీసులతోనే కయ్యం పెట్టుకోవడం. పోలీసులను డబ్బులతో కొనేయడం.. ఇలాంటి సీన్స్ కాస్త పుష్పతో మ్యాచ్ అవుతూ ఉంటాయి. పాబ్లో స్టైల్ కూడా పుష్పరాజ్ తరహాలోనే ఉంటుంది. పుష్పరాజ్ తరహాలోనే పాబ్లో కూడా తన భార్యను ఎంతో ప్రేమిస్తాడు. ‘పుష్ప: ది రైజ్’లో పెళ్లి వరకు మాత్రమే మనం చూశాం. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది.. ‘నార్కోస్’ వెబ్ సీరిస్ చూస్తే అర్థమైపోతుంది. మరి, సుకుమార్.. పూర్తిగా అదే తరహాలో కథను రాసుకున్నాడనేది కచ్చితంగా చెప్పలేం. ఇదే ‘పుష్ప: ది రూల్’ స్టోరీ అని చెప్పుకోవడం కూడా తొందరపాటే అవుతుంది. కాబట్టి, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ తరహా స్టోరీలు మీకు ఇష్టమైతే ‘నార్కోస్’ వెబ్ సీరిస్ చూడండి. ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
Images Credit: Netflix India
Also Read: 'లెక్క' తప్పిన జాన్వి- ఆడేసుకుంటున్న నెటిజన్స్, పాపం అడ్డంగా బుక్కైపోయింది
Also read: కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ, ఇంత కష్టంగా ఉంటుందా అంటూ కామెంట్