Kantara Oscars Nomination: ఆస్కార్ నామినేషన్స్‌కు ‘కాంతార’ - బరిలో మూడు ఇండియన్ మూవీస్!
సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతార’ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కోసం పంపినట్లు హోంబలే ప్రొడక్షన్స్ వెల్లడించింది. రిషబ్ శెట్టిన నటించి, తెరకెక్కించిన ఈ కన్నడ చిత్రం రూ. 400 కోట్లు వసూలు చేసింది.
ఈ ఏడాది కన్నడ చిత్రం ‘కాంతార’ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లు వసూలు చేసింది. చిన్న సినిమాగా విడుదలై, పాన్ ఇండియా రేంజిలో బ్లాక్ బస్టర్ సాధించింది. 2022లో అత్యధికంగా చూసిన, ఎక్కువ మంది మాట్లాడిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించేందుకు రెడీ అయ్యింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ కోసం చిత్ర నిర్మాణ సంస్థ పంపించింది.
‘కాంతార’ను ఆస్కార్ నామినేషన్ కోసం పంపించాం- హోంబేల్ ప్రొడక్షన్స్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరక్కించిన ‘RRR’ చిత్రం ఇప్పటికే పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ కోసం పోటీ పడుతోంది. తాజాగా ‘కాంతార’ సినిమాను కూడా ఆస్కార్ నామినేషన్ కోసం పంపించారు. ఈ విషయాన్ని తాజాగా హోంబేల్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. హోంబలే ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఆస్కార్ నామినేషన్స్ కి చివరి క్షణంలో దరఖాస్తు పంపినప్పటికీ, నామినేట్ అవుతుందనే ఆశ తమకు ఉందని ఆయన దీమా వ్యక్తం చేశారు. "మేము ‘కాంతార’ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కోసం పంపించాం. నామినేషన్స్ తుది గడువుకు చివరి క్షణంలో అప్లై చేశాం. అయినా, ఈ చిత్రానికి వచ్చిన ప్రజాదరణను పరిగణలోకి తీసుకుని, ఆస్కార్ కు నామినేట్ చేస్తారని భావిస్తున్నాం” అని హోంబలే ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్ తెలిపారు.
విడుదలైన అన్ని చోట్ల సంచలన విజయం
‘కాంతార’ సినిమా సెప్టెంబర్ 30, 2022న తొలుత కన్నడలో విడుదల అయ్యింది. ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని అందుకుంది. కన్నడ నాట ఏకంగా రూ. 200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళ భాషల్లో విడుదల అయ్యాయి. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. రిషబ్ శెట్టి స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.
‘కాంతార’ సీక్వెల్ కు కొనసాగుతున్న ప్రయత్నాలు
అటు ‘కాంతర’ సినిమా చక్కటి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ ను తెరకెక్కించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ధృవీకరించారు. హొంబలే ప్రొడక్షన్స్ అధినేత విజయ్ కూడా సీక్వెల్ తీసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అయితే, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. కానీ, ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.
Read Also: వామ్మో, ప్రాణాలు పోతే? హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ డేరింగ్, సినిమా చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్టంట్!
View this post on Instagram