Tollywood: సీనియర్ డైరెక్టర్స్ మళ్లీ ఫార్మ్ లోకి వచ్చేనా?
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్స్ తిరిగి ట్రాక్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. గుణ శేఖర్, కృష్ణ వంశీ మొదలుకొని.. కృష్ణారెడ్డి, విజయ్ భాస్కర్ వరకూ అందరూ హిట్ కోసం కష్టపడుతున్నారు.
టాలీవుడ్ కు ఎప్పటికప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్స్ పరిచయం అవుతూనే ఉంటారు. సరికొత్త ఐడియాలతో వైవిధ్యమైన కథలను చెబుతూ, ఆడియన్స్ ను అలరిస్తున్నారు. దీంతో ఒకప్పుడు హవా కొనసాగించిన సీనియర్ దర్శకులు ఔట్ డేటెడ్ అయిపోతున్నారు.. ఈతరం దర్శకులతో పోటీ పడలేకపోతున్నారు. అయితే వారిలో కొందరు మాత్రం తిరిగి ఫార్మ్ లోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ 'గులాబీ', 'నిన్నే పెళ్లాడుతా', 'సింధూరం', 'అంతఃపురం', 'మురారి', 'ఖడ్గం', 'రాఖీ', 'చందమామ' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా రాణించిన ఆయన.. సరైన హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. చివరగా 2017లో 'నక్షత్రం' అనే డిజాస్టర్ మూవీ ఇచ్చిన దర్శకుడు.. ఇప్పుడు 'రంగ మార్తాండ' చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ట, బ్రహ్మానందం, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
గుణశేఖర్
కమర్షియల్ చిత్రాలతో పాటుగా పౌరాణిక, చారిత్రక సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణ శేఖర్. భారీ సెట్స్ - వీఎఫెక్స్ - భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా పిలవబడే ఆయన.. 'రుద్రమదేవి' తర్వాత మరో సినిమాని అందించలేకపోయారు. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత 'శాకుంతలం' అనే పాన్ ఇండియా చిత్రంతో వస్తున్నారు. ఇందులో సమంత టైటిల్ రోల్ ప్లే చేసింది. ఈ మైథాలజీ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లలోకి రాబోతోంది.
పూరీ జగన్నాథ్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు గాంచిన పూరీ జగన్నాథ్.. ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ సినిమాలు చేస్తుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ తమ కెరీర్ లోనే మెమరబుల్ హిట్స్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ తో ట్రాక్ లోకి వచ్చిన పూరీ.. 'లైగర్' ఫ్లాప్ తర్వాత ఒక్కసారిగా కిందకి పడిపోయారు. సెట్స్ మీదకు తీసుకొచ్చిన 'JGM' ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో తన కథలకు సరైన హీరో కోసం చూస్తున్నారు పూరీ.
మెహర్ రమేష్
టాలీవుడ్ లో ప్లాప్ డైరెక్టర్ గా ముద్రపడిపోయిన మెహర్ రమేష్.. 2013లో తీసిన 'షాడో' తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే దశాబ్ద కాలం గడిచిన తరువాత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడు. తమిళ హిట్ మూవీ 'వేదలమ్'ని 'భోళా శంకర్' పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.
శ్రీను వైట్ల
టాలీవుడ్ అగ్ర హీరోలందరితో సినిమాలు చేసిన డైరెక్టర్ శ్రీను వైట్ల.. గత కొంతకాలంగా తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. చివరిగా 2018లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' తర్వాత మరో మూవీ చేయలేదు. మంచు విష్ణుతో 'ఢీ'కి సీక్వెల్ గా 'డి అండ్ డి - డబుల్ డోస్' అనే మూవీని అనౌన్స్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటనకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మ్యాచో స్టార్ గోపీచంద్ తో ఓ మూవీ సెట్ చేసుకున్నారు శ్రీను వైట్ల. ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
వి.వి.వినాయక్
మాస్ - కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి.వి. వినాయక్.. 'ఇంటెలిజెంట్' వంటి డిజాస్టర్ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
కె.విజయ్ భాస్కర్
స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి వియవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు కె విజయ్ భాస్కర్.. చివరిగా 2013లో 'మసాలా' మూవీని డైరెక్ట్ చేశారు. అయితే పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. శ్రీ కమల్ - శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేకృష్ణారెడ్డిరు తెచ్చుకున్న ఎస్వీ .. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు అందుకున్నారు. ఎప్పుడో ఫేడౌట్ అయిన సూపర్ సీనియర్ దర్శకుడు.. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. లేటెస్టుగా ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఆర్గానిక్ మామ – హైబ్రిడ్ అల్లుడు’ అనే చిత్రంతో వస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఇలా పలువురు సీనియర్, సూపర్ సీనియర్ దర్శకులు సాలిడ్ హిట్ కొట్టి, స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరికి విజయాలు వరిస్తాయో, ఎవరు కంబ్యాక్ ఇస్తారో చూడాలి.