త్రిష అందుకే బాలీవుడ్ అవకాశాలను వదులుకుందట!
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ త్రిష 'ఖట్టా మీఠా' తర్వాత బాలీవుడ్ లో చేయకపోవడానికి గల కారణాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను ముంబైకి షిఫ్ట్ అయ్యే ఆలోచన లేదని చెప్పారు.
Trisha Krishnan Birthday: చిత్ర పరిశ్రమలో 24సంవత్సరాల అనుభవం గల స్టార్ హీరోయిన్ త్రిష.. ఇప్పటివరకు 50 చిత్రాలకు పైగా నటించారు. దక్షిణాది చిత్రాలలో అతిపెద్ద మహిళా సూపర్ స్టార్‌లలో ఒకరిగా నిలిచారు. 2010లో బాలీవుడ్ వైపు మళ్లిన ఈ భామ.. అక్షయ్ కుమార్ నటించిన ప్రియదర్శన్ కామెడీ చిత్రం 'ఖట్టా మీఠా'లో నటించారు. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు తిరిగి చూల్లేదు. అయితే ఆమె బాలీవుడ్ కి తిరిగి వెళ్లకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. అవేంటంటే..
మీమ్స్ కే పరిమితం
త్రిష బాలీవుడ్ ఫిల్మ్ 'ఖట్టా మీఠా' బాక్సాఫీస్ వద్ద దారుణంగా పతనమైంది. ఈ సినిమాలో త్రిష తన సోదరి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అక్షయ్‌కి సహాయం చేసే మున్సిపల్ ఆఫీసర్‌గా నటించింది. ‘ఖట్టా మీఠా’.. కేవలం మీమ్స్ ద్వారా పాపులర్ అయినప్పటికీ , థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది.
బాలీవుడ్‌ను వదిలేయడానికి కారణం?
బాలీవుడ్‌లో ఎందుకు సినిమాలు చేయడం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిషను అడగగా.. ఈ సమయంలో తాను బొంబాయికి షిఫ్ట్ అయ్యేందుకు సిద్ధంగా లేనని, ఎందుకంటే దాని వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయని చెప్పారు. అది తన కెరీర్ మళ్లీ ప్రారంభించేలా చేస్తాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆమె దక్షిణ భారత చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, బాలీవుడ్ లో నటించి , తన కెరీర్ ను రిస్క్ లో పెట్టాలని అనుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
చేసే పాత్రకు వాల్యూ ఉండాలి
తాను ఏదైనా హిందీ సినిమాలో చేస్తే దానికి తగిన వాల్యూ ఉండాలని, ఆ విషయంలో తాను చాలా ఓపెన్ గా ఉంటానని త్రిష చెప్పారు. అది కేవలం హిందీ భాషలోనే కాదు.. ఏ భాషకైనా ఇదే పాటిస్తానన్నారు. ఆ విషయంలో తనకు ఎప్పుడూ ఆంక్షలు లేవన్న త్రిష.. తాను ఇప్పుడు పాన్-ఇండియన్ సినిమా, OTT వంటి అన్ని చోట్లా మంచి కంటెంట్‌తో సాగిపోతున్నానని చెప్పారు.
తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ త్రిష కృష్ణన్. త్రిష ఈ రోజు (మే 4) 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'వర్షం', సిద్దార్థ్ 'నువ్వస్తానంటే నేనొద్దంటానా', మహేశ్ బాబు 'అతడు' సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ.. ఆ తర్వాత టాలీవుడ్ లోని అందరు అగ్ర హీరోలతో నటించి, మెప్పించారు. తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకు గాను త్రిష ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లోనూ తన సత్తా చాటారు. హీరోయిన్ కాకముందు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన త్రిష.. ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన 'జోడి'లో ఓ సైడ్ క్యారెక్టర్ లో నటించింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు.
1999లో మిస్ చెన్నైగా ఎంపికైన త్రిష... 2001లో మిస్ ఇండియా స్మైల్‌గా ఎంపికయ్యారు. అలా సినిమాల్లో తన అందం, నటనతో దూసుకుపోతున్న ఆమె.. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో కుందవాయి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాపై త్రిష ముందు నుంచీ పెట్టుకున్న ఆశలన్నీ.. నిజమైనట్టే తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయట.
Also Read : 'పలాస' దర్శకుడితో వరుణ్ తేజ్ సినిమా - పీరియడ్ క్రైమ్ డ్రామా!