Samantha: మరోసారి బన్నీతో చిందులేయనున్న సమంత - 'పుష్ప 2' కోసం సుకుమార్ భారీ స్కెచ్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప 2' మూవీలో ఐటమ్ సాంగ్ కోసం మరోసారి సమంతనే తీసుకోబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
'పుష్ప' (Pushpa) మూవీలో 'ఊ అంటావా మావా' అంటూ అల్లు అర్జున్ తో అదిరిపోయే స్టెప్పులేసిన సమంత మరోసారి చిందులేయబోతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం బన్నీ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప 2'లో మరోసారి చిందేసే ఛాన్స్ అందుకుందట సామ్. టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'పుష్ప 2' ముందు వరసలో ఉంటుంది. 'పుష్ప: ది రైజ్' నేషనల్ వైడ్ గా విజయం అందుకోవడంతో పార్ట్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
రీసెంట్ గానే 'పుష్ప 2' న్యూ షెడ్యూల్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హడావిడి చేస్తోంది. అదేంటంటే, 'పుష్ప2' లో మరోసారి బన్నీతో స్టెప్పులేయబోతుందట సమంత. పుష్ప: ది రైజ్ మూవీలో 'ఊ అంటావా మావా' అంటూ సమంతతో స్పెషల్ సాంగ్ చేయించాడు సుకుమార్. ఆ పాట ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవ్వడంలో 'ఊ అంటావా' సాంగ్ కూడా ప్రధాన కారణమని చెప్పడంలో సందేహం లేదు. ఈ పాటలో అల్లు అర్జున్ తో కలిసి సమంత వేసిన హాట్ స్టెప్స్ కి సినీ లవర్స్ ఫిదా అయిపోయారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ పాటలో సమంత గ్లామర్ షో చేయడంతోపాటు డాన్స్ ఇరగదీసింది. దీంతో పాన్ ఇండియా లెవెల్ లో ఈ పాటకు భారీ ఆదరణ లభించింది. కాగా పార్ట్ 2లో మరింత గ్రాండ్ గా ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ నుంచి మొదలుకొని కోలీవుడ్, మాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ హీరోయిన్స్ తో చర్చలు జరిపినా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో మళ్లీ సమంతనే రంగంలోకి దించాలని భావిస్తున్నాడట. గత కొన్ని రోజులుగా 'పుష్ప2' ఐటమ్ సాంగ్ గురించి చర్చలు జరుగుతుండగా తాజాగా ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని అంటున్నారు. మళ్లీ సమంత తోనే 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
కేవలం ఐటమ్ సాంగ్ మాత్రమే కాకుండా సినిమాలో కొన్ని సన్నివేశాల్లోనూ ఆమెను నటింపజేయాలని అనుకుంటున్నారట. దీనిపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ ప్రచారం అవుతుంది. ఈ విషయం తెలిసిన కొందరు 'పుష్ప 2'ఐటమ్ సాంగ్ కోసం మళ్లీ సమంతనే తీసుకుంటే బాగుంటుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియాతో పాటు రష్యా, చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Also Read : థియేటర్స్‌లో ప్లాప్, టీవీల్లో హిట్ - 'ఆదిపురుష్'కి భారీ టీఆర్పీ, చిరు, బాలయ్య సినిమాలను మించి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial