పుష్పరాజ్ సారీ చెప్పాడా? ఎవరికి, ఎందుకు? లీకైన ‘పుష్ప: ద రూల్’ స్క్రిప్ట్, కావాలనే చేశారా?
‘పుష్ప-2’ (Pushpa: The Rule) మూవీ నుంచి ఓ సీన్ డైలాగ్ లీకైంది. అది కూడా అల్లు అర్జున్ అఫీషియల్‌గా రిలీజ్ చేసిన వీడియో నుంచి!
‘పుష్ప: ద రూల్’ సినిమా నుంచి ఓ సీన్ లీకైంది. ఒక పర్టిక్యులర్ సీన్ రైటింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ సీన్ వివరాలేంటో చెప్పుకునే ముందు ‘పుష్ప: ద రైజ్’ సినిమాలో శ్రీవల్లి పాటలో రెండు లైన్స్ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే పుష్ప క్యారెక్టర్ ఆర్క్ ఏంటో అర్థమయ్యే చాన్స్ ఉంది. ఆ పాటలో ఏముంటుంది..? ‘‘ఎవరికీ, ఎప్పుడూ తలవంచని నేను, నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను’’.. అని ఉంటుంది. అంటే ఎవరి ముందూ తగ్గేదేలే అనే టైప్ క్యారెక్టర్ పుష్పది. ప్రేమలో పడ్డాక మాత్రం అందుకు ఎక్సెప్షన్.
ఇప్పుడు లీకైన సీన్ పేపర్ జోలికి వద్దాం. ఏదో సీరియస్ విషయం మీద శ్రీవల్లి, పుష్ప మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది సీన్ పేపర్ చూస్తుంటే. ‘‘నీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకో మళ్లీ రేప్పొద్దున నన్నంటావ్’’ అని శ్రీవల్లి డైలాగ్ ఉన్నట్టుగా సీన్ పేపర్ లో ఉంది. మళ్లీ దానికి కనెక్టింగ్ సీన్.. ‘‘నువ్వు చెప్పు.. నన్ను చెప్పేయమంటావా’’ అని పుష్ప అడుగుతాడు. ‘‘వద్దు తిడతావు’’ అని శ్రీవల్లి బదులు ఇస్తుంది. ‘‘పర్లేదు చెప్పు’’ అని పుష్ప అడిగినప్పుడు... ‘‘చెప్పేయ్ సామీ’’ అని శ్రీవల్లి బదులిస్తుంది. ఇక్కడ సీన్ చూస్తుంటే... ఎవరి ముందో కాస్త తగ్గడమో లేదా సారీ చెప్పడమో లాంటి సీన్ అని అర్థమవుతోంది. అంటే కేవలం శ్రీవల్లి చెప్పింది కాబట్టే పుష్ప సారీ చెప్పేందుకు సిద్ధపడ్డాడన్నమాట.
చూశారా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ సమయానికి పుష్ప క్యారెక్టర్ ఆర్క్..! అసలు ఇంతకీ పుష్ప సారీ చెప్పాడా లేదా అసలు అలాంటి సిట్యుయేషన్ ఏమొచ్చింది...? ఏమో సినిమా వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఇంతకూ ఈ సీన్ పేపర్ ఎక్కడ్నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? ‘ఇన్‌స్టాగ్రామ్’ నుంచి. ఔనండి, అల్లు అర్జున్‌తో ఇన్‌స్టాగ్రామ్ కొలాబరేట్ అయింది. ఈ సందర్భంగా ‘పుష్ప-2’ సెట్స్‌లో ఓ వీడియో షూట్ చేశారు. ఆ వీడియోలో ఒక సెకన్ కన్నా చాలా తక్కువ వ్యవధి మాత్రమే సుకుమార్ చేతిలో స్క్రీప్ట్ పేపర్ కనిపించింది. దాన్ని రొటేట్ చేసి జూమ్ చేస్తే ఇదిగో ఇలా స్క్రిప్ట్ కనిపించింది. మరి, ఇది కావాలనే చేశారా? లేదా.. ఎవరూ కనిపెట్టలేరులే అని అనుకున్నారో.. మొత్తానికి లీకైన ఈ స్క్రిప్ట్ మాత్రం అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది.
ఇన్ స్టాతో జత కట్టిన తొలి ఇండియన్ హీరో అల్లు అర్జున్
ఇన్‌స్టాగ్రామ్‌తో అధికారికంగా కొలాబరేట్ అయిన తొలి నటుడిగా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ ఇండియన్ స్టార్ కు లభించలేదు. ఇన్‌స్టాగ్రామ్ బృందం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి అల్లు అర్జున్‌కి సంబంధించిన కొన్ని వీడియోలను చిత్రీకరించింది. సుమారు ఒక రోజంతా ఇన్ స్టా టీమ్ ఆయనతోనే గడిపింది. ఆయన రోజు వారీ జీవిత విశేషాలను వీడియోల్లో బంధించింది. బన్నీ ఈ వీడియోను ఇవాళ ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ నిన్న అల్లు అర్జున్ ఇన్ స్టా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఆయన పెట్టిన పోస్టు టాలీవుడ్ తో పాటు ఆయన అభిమానులలో ఆసక్తి కలిగించింది. బుధవారం ఉదయం 9 గంటలకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించాడు. వ్యక్తిగత విశేషం ఏమైనా చెప్పబోతున్నారా? లేదంటే సినిమా అప్‌డేట్ ఇస్తారా? అని సినీ జనాలతో పాటు మూవీ లవర్స్ ఎదురు చూశారు. కానీ, ఇన్ స్టాలో ఆయన వీడియో విడుదల కావడంతో బన్నీ చెప్పిన సర్ ప్రైజ్ ఇదే అని అందరికీ అర్థం అయ్యింది.
ఇన్ స్టాలో బన్నీకి భారీ ఫాలోయింగ్
అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఇన్ స్టాలో ఫాలోయర్స్ సంపాదించుకున్నారు. ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 20 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఆయనే కావడం విశేషం. నవంబర్ 2017 లో, అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చాడు అల్లు అర్జున్. అప్పటి నుంచి రోజు రోజుకూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ, అభిమానులను పెంచుకుంటూ వెళ్తున్నాడు.