కృతి శెట్టి కాదు, రవితేజ సినిమాలో హీరోయిన్గా 'ఓజి' బ్యూటీ!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో మలయాళ ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.
మలయాళ ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ మళ్లీ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీబిజీగా మారుతోంది. నాని 'గ్యాంగ్ లీడర్' తో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదట్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకు లేకపోయింది. 'గ్యాంగ్ లీడర్' తర్వాత వెంటనే శర్వానంద్ 'శ్రీకారం' సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ సక్సెస్ అవ్వలేదు. అందంతో పాటూ టాలెంట్ ఉన్న ప్రియాంక మోహన్ కి టాలీవుడ్ లో కలిసి రాకపోవడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ సూర్య సరసన 'ఈటి' శివ కార్తికేయన్ తో 'డాక్టర్', 'డాన్' మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకొని అక్కడే బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'కెప్టెన్ మిల్లర్'(Captain Miller) లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రీసెంట్ గా మళ్లీ టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఓజి'(OG)లో నటించే ఛాన్స్ అందుకుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఓజి తర్వాత రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని సరసన 'సరిపోదా శనివారం'(Saripoda Shanivaram) మూవీలో హీరోయిన్ గా నటించే ఆఫర్ పట్టేసింది ప్రియాంక.
గతంలో నాని సరసన 'గ్యాంగ్ లీడర్' లో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి నాచురల్ స్టార్ తో జత కడుతోంది. ఇక ఇప్పుడు ఏకంగా మాస్ మహారాజా రవితేజతో జోడి కట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ #RT4GM లో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని మూవీ యూనిట్ ఎంపిక చేసినట్లు సమాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ముందుగా రష్మిక మందనను అనుకున్నారట. కానీ ఆమె డేట్స్ దొరకకపోవడంతో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని తీసుకున్నారు. అది కూడా సాధ్యపడలేదు. దీంతో ఫైనల్ గా ప్రియాంక మోహన్ ని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
అయితే మేకర్స్ నుంచి దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఒక్క హీరోయిన్ ఎంపిక తప్పితే మిగతా కాస్ట్ అండ్ క్రూ మొత్తం రవితేజ మూవీకి సిద్ధంగా ఉన్నారు. రీసెంట్ గానే రవితేజ - గోపీచంద్ మలినేని మూవీకి పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను పోస్టర్స్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు ఓకే అయితే ప్రియాంక మోహన్ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉంటాయి. అవన్నీ పెద్ద హీరోలవే కాబట్టి వాటిలో ఈ రెండు హిట్ అయినా కూడా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. మరి ప్రియాంక మోహన్ తన రీఎంట్రీలో ఈ భారీ ప్రాజెక్టులతో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.
Also Read : బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు గేమ్ మారుద్దం అనుకుంటాడు - విశ్వక్ సేన్ ఆగ్రహం!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial