Martin Movie: మైత్రి చేతుల్లోకి కన్నడ స్టార్ ధృవ్ సర్జా పాన్ ఇండియా మూవీ 'మార్టిన్'... అక్టోబర్‌లో గ్రాండ్ రిలీజ్, ఎప్పుడంటే?
కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా హీరోగా నటిస్తున్న 'మార్టిన్' మూవీ దసరా కానుకగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ మూవీని నైజాంలో మైత్రి వారు రిలీజ్ చేయబోతున్నారనే అప్డేట్ తాజాగా వచ్చింది.
కన్నడ స్టార్ ధృవ సర్జా టైటిల్ రోల్‌లో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం 'మార్టిన్' దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అన్న విషయాన్ని కూడా మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
మైత్రి చేతుల్లోకి 'మార్టిన్'
పాన్ ఇండియా రేసులో టాలీవుడ్ హీరోలు ముందుంటే ఆ తర్వాత స్థానంలో కన్నడ హీరోలు ఉన్నారు. సౌత్ లో కేజిఎఫ్ కి ముందు కన్నడ సినిమా అంటే ఏంటో ఇతర భాషల ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. ఎవరో ఒకరిద్దరు హీరోలు మినహాయించి అసలు ఆ భాషలో రిలీజ్ అయ్యే సినిమాలను కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో కన్నడ పరిశ్రమ నుంచి కూడా మంచి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణను దక్కించుకుంటున్నాయి. కేజీఎఫ్ తో పాటు కాంతారా మూవీ కూడా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే కన్నడ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలపై కూడా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే కన్నడ మేకర్స్ కూడా ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తమ సినిమాలను తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల ప్రేక్షకులకు కూడా నచ్చేలా మెచ్చేలా రూపొందిస్తున్నారు. ఇక తాజాగా కన్నడ భారీ చిత్రం 'మార్టిన్ రిలీజ్' కు రెడీ అవుతుంది. అయితే ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేతుల్లోకి తీసుకోవడం విశేషం.
ధృవ సర్జా హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మార్టిన్'. ఈ మూవీలో ధృవ సరసన వైభవి శాండిల్య హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కథ అందించిన ఈ సినిమాకు ఎపి అర్జున్ దర్శకత్వం వహించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను వాసవి ఎంటర్‌ప్రైజెస్, ఉదయ్ కె. మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఉదయ్ కె. మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో సుకృత వాగ్లే, అన్వేషి జైన్, సాధు కోకిల, చిక్కన్న తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించారు. అయితే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా తప్పకుండా అలరిస్తుందని నమ్మకంతో ఉన్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మార్టిన్ ను నైజాం ఏరియాలో పంపిణీ చేయడానికి రెడీ అయింది. ఈ మేరకు దీనిపై మార్టిన్ చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ డేట్ ని కూడా మరోసారి కన్ఫర్మ్ చేసింది.
ఈ సినిమాలో ధృవ సర్జా లెఫ్టినెంట్ బ్రిగేడియర్ అర్జున్ సక్సేనా అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇండియా- పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వం, ఉగ్రవాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టుగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా వెల్లడయ్యిండి . ఇక నైజాంలో మైత్రి వారు తీసుకురాబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుంది అనేది చూడాలి. అక్టోబర్ 11న 'మార్టిన్' మూవీ దసరా కానుకగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అనే అప్డేట్ తో 'మార్టిన్'పై మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఏపీలో కూడా ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ మూవీ రైట్స్ కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. దానిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Also Read: జానీ మాస్టర్ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు