Mohan Babu: వాళ్లు ఎంగిలి కూడుకు ఆశపడ్డారు, అవార్డులు రాకుండా చేసినందుకు థ్యాంక్స్ చెప్పా - మోహన్ బాబు కామెంట్స్ వైరల్
టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగిన మోహన్ బాబు గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఎన్నో అద్భుత సినిమాలు చేసినా, కొంతమంది కావాలని తన చిత్రాలకు అవార్డులు రాకుండా చేశారని ఆరోపించారు.
Mohan Babu About Awards: మంచు మోహన్ బాబు. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. విలన్ గా, హీరోగా ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లో తన మార్కు నటనతో అభిమానులను ఎంతగానో అలరించారు. తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటులుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత అదే స్థాయిలో డైలాగులు చెప్పి మెప్పించారు మోహన్ బాబు. అందుకే ఆయనకు డైలాగ్ కింగ్ అనే పేరు కూడా వచ్చింది. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సునామీ సృష్టించడంతో కలెక్షన్ కింగ్ గా మారిపోయారు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో అద్భుత హిట్లను అందించిన నటుడు మోహన్ బాబు.
మోహన్ బాబు కామెంట్స్ మళ్లీ వైరల్
మోహన్ బాబు తన కెరీర్ లో 570 చిత్రాలకు పైగా నటించారు. 70కి పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డును అందించింది. ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు కీలక విషయాలను వెల్లడించారు. తనకు అవార్డులు రాకుండా కొంత మంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
అవార్డులు రాకుండా చేసినందుకు థ్యాంక్స్ చెప్పా- మోహన్ బాబు
తన కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాలు చేశానని చెప్పారు మోహన్ బాబు. ‘అసెంబ్లీ రౌడీ’, ‘రాయలసీమ రామన్న చౌదరి’, ‘పెద్దరాయుడు’, ‘అల్లుడు గారు’. ‘శ్రీరాములయ్య’, ‘అడవిలో అన్న’ సహా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించానన్నారు. అయినా, తనకు సినిమాలకు అవార్డులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాలేదు అనడం కంటే రాకుండా చేశారు అనేది కరెక్టుగా ఉంటుందన్నారు. “నా కెరీర్ లో తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో సినిమాలు చేశాను. ఆ సినిమాలను ప్రజలు ఎంతో అద్భుతంగా ఆదరించారు. కానీ, నా సినిమాలకు అవార్డులు రాలేదు. రాకుండా కొంత మంది కుట్రలు చేశారు. ఆ వ్యక్తులు ఎవరో నాకు బాగా తెలుసు. వాళ్లకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడా. థ్యాంక్స్ కూడా చెప్పా. నేను నటించిన అద్భుత సినిమాలను కాదని, పనికిమాలిన సినిమాలకు అవార్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నాను. పెద్ద వయసు ఉన్న కమిటీ సభ్యులు కూడా ఎంగిలి కూడుకు ఆశపడ్డారు. న్యాయ నిర్ణేతలుగా ఉండాల్సిన వాళ్లు అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించాను” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. డైలాగ్ కింగ్ బ్లాక్ బస్టర్ సినిమాలకు అవార్డులు రాకపోవడం నిజంగా దారుణం అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నెటిజన్స్ కూడా ఆయన కోపంలో న్యాయం ఉందంటున్నారు.
‘కన్నప్ప’ పనుల్లో మోహన్ బాబు బిజీ
ప్రస్తుతం మోహన్ బాబు నిర్మాతగా మంచు విష్ణు ప్రధానపాత్రలో ‘కన్నప్ప’ అనే సినిమాలు చేస్తున్నారు. రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక రూపొందిస్తున్నారు. తాజాగాఈ సినిమా న్యూజిలాండ్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మొత్తం 600 మంది హాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా కోసం పని చేసినట్లు మోహన్ బాబు చెప్పారు.
Read Also: మోడీగా మారిన ‘రాముడు’ - ‘ఆర్టికల్ 370’లో ప్రధానిగా రామాయణం స్టార్ అరుణ్ గోవిల్ సర్‌ప్రైజ్