Khakee 2 Web Series On Netflix: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - ఇక వయలెన్స్ తప్పదా..! - 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' సీజన్ 2 వచ్చేస్తోంది..
Khakee The Bengal Chapter Series On Netflix: ఓటీటీ ఆడియన్స్ కోసం మరో క్రైమ్ థ్రిల్లర్ రెడీ అవుతోంది. 'ఖాకీ: ది బిహార్ చాప్టర్'కు కొనసాగింపుగా 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' నెట్ ఫ్లిక్స్‌లో రానుంది.

Khakee The Bengal Chapter Netflix Release Date: క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్ ఎక్కువగా ఇష్టపడే వారి కోసం ఓటీటీలు ప్రస్తుతం అలాంటి జానర్‌లోనే ఎక్కువగా మూవీస్, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంచుతున్నాయి. అలాంటి కోవకు చెందిందే 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' (Khakee: The Bihar Chapter) నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కరణ్ టక్కర్, అవినాష్ తివారి, అభిమన్యుసింగ్, నీరజ్ కశ్యప్, జతిన్ శరణ్, రవి కిషన్, అశుతోష్ రాణా, నికితా దత్త, ఆకాంక్ష సింగ్, ఐశ్వర్య సుష్మిత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ సీజన్ 1 2022, నవంబర్ 25న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై ఓటీటీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఆయన రచించిన 'Bihar Diaries' బుక్ ఆధారంగా సిరీస్ తీశారు.
View this post on Instagram
'సూపర్ పోలీస్ వర్సెస్ గ్యాంగ్ స్టర్' పోరు ఆసక్తికరంగా సాగుతూనే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన 5 నెలలకు పైగా టాప్ 10 షోల్లో ఒకటిగా నిలిచిన ఈ సిరీస్ ఆద్యంతం ట్విస్టులతో ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచింది. ఆ తర్వాత ఏడాదే సీజన్ 2పై ప్రకటన వచ్చినా అది రాలేదు. తాజాగా.. త్వరలోనే సీజన్ 2 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' రానున్నట్లు 'నెట్ ఫ్లిక్స్' సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించి టైటిల్ టీజర్ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. 'ఖూన్ యా కానూన్ (రక్తం లేదా చట్టం).. గెలుపు దేనిది?' అనే టైటిల్ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
అసలు కథేంటంటే..?
బీహార్‌లో పేరు మోసిన ఓ గ్యాంగ్ స్టర్ ఆట కట్టించేందుకు ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన టీంతో కలిసి చేసిన ప్రయత్నమే సిరీస్ 1గా రూపొందింది. బీహార్‌లో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు చేస్తూ భయానక వాతావరణం సృష్టించిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్‌ను పట్టుకునేందుకు ఐపీఎస్ అధికారి ఎలాంటి వ్యూహాలు రచించారు. అతన్ని పట్టుకోవడంలో ఎదురైన సవాళ్లు..? వంటి వాటిని సిరీస్‌లో చూపించారు. ఇక, 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' కొత్త సీజన్‌లో కోల్‌కతాలోని ఓ డాన్ ఆటను కట్టించే పోలీస్ ఆఫీసర్ అర్జున్ మైత్రా కథను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో జీత్ మద్నాని, ప్రోసేన్ జీత్ ఛటర్జీ, శాశ్వతా ఛటర్జీ వంటి వాళ్లు నటిస్తున్నారు.
కొత్త సిరీస్‌లో బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి సైతం నటిస్తున్నారు. ఈయన తెలుగులో 'నేనెక్కడున్నా' మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే, ఫస్ట్ సీజన్‌లో నటి ఆకాంక్ష సింగ్ ఐపీఎస్ అధికారి భార్య పాత్రలో నటించి మెప్పించారు. ఆమె తెలుగులో 'మళ్లీ రావా', నాగార్జున దేవదాస్ మూవీల్లో నటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

