(Source: ECI/ABP News/ABP Majha)
Uday Kiran: ఆ పుకార్లు నా కెరీర్‌ని దిగజార్చాయి - ఉదయ్ కిరణ్ పాత వీడియో వైరల్
Uday Kiran: ఉదయ్ కిరణ్.. మంచి కథలతో, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తన కెరీర్ గురించి ఆయన అప్పట్లో మాట్లాడిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
Uday Kiran Old Interview Viral: ఉదయ్ కిరణ్.. ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చిన్న వయసులో తనువు చాలించాడు. అయితే, ఇప్పటికీ ఆయన సినిమాలకు మాత్రం ఆదరణ అలానే ఉంది. ఎన్నో మంచి సినిమాలు చేశారు ఆయన. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో దూసుకుపోయారు. అయితే, ఆయన జీవితంలో ఒక్కసారిగా కుదుపు. సినిమా ఆఫర్లు రాకపోవడం, పుకార్లు వల్ల ఎంతో నష్టాపోయారట ఉదయ్ కిరణ్. 12 ఏళ్ల కిందట ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ఇప్పుడు అనూహ్యంగా ఆ వీడియో వైరల్ గా మారింది.
పుకార్లు నా కెరీర్‌ని దిగజార్చాయి
సినిమాలు ఆడకపోవడం, తన మీద వచ్చిన పుకార్ల వల్ల ఛాన్సులు రాలేదని ఉదయ్ అన్నారు. తనపై వచ్చిన పుకార్లకు క్లారిఫికేషన్ ఇవ్వనందు వల్లే అలా జరిగిందనట్లుగా అభిప్రాయపడ్డారు. "సినిమా గ్యాప్ అనేది ఎందుకు వస్తుందంటే? లక్, ఫేట్. ఒక్కోసారి కంటిన్యూస్ గా మంచి కథలు వస్తాయి. మొదట్లో నాకు మంచి స్టోరీలు వచ్చాయి. తమిళ్ లో చాలా స్క్రిప్టులు వస్తున్నాయి. వింటున్నాను. తమిళ్ లో మూడు సినిమాలు చేశాను. కానీ, అక్కడ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అయినా కూడా ఇంకా ఎక్కువ చేయాలని, మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. నా మీద చాలా క్రిటిసిజమ్ ఉంది. కొంతమంది నన్ను ఇష్టపడతారు. కొంతమంది నన్ను ద్వేషిస్తారు. కొంతమంది నా మీద కామెంట్ చేస్తారు. కొంతమంది నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. ప్రతీది బ్యాగ్రౌండ్ లో జరుగుతుంది. ఎప్పుడూ నేను బయటికి వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. నా గురించి చాలా పుకార్లు ఉన్నాయి. బయటికి వచ్చి.. క్లారిఫికేషన్ ఇవ్వాలని నేను అనుకోలేదు. ఎంతమందికని క్లారిఫికేషన్ ఇస్తాం" అంటూ తనపై వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడారు ఉదయ్ కిరణ్.
కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు..
ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో అనే చెప్పాలి. కెరీర్ మొదట్లోనే ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఆయన. తమిళ చిత్ర పరిశ్రమలో సైతం.. ఆయన సినిమాలు చేశారు. కానీ అక్కడ పెద్ద హిట్లు అందుకోలేకపోయారు. అతని మొదటి మూడు చిత్రాలు, 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. అతనికి "హ్యాట్రిక్ హీరో" అనే బిరుదును సంపాదించిపెట్టాయి. మూడు చిత్రాలు, అన్నీ ప్రేమకథలు చేయడంతో అతనికి 'లవర్ బాయ్స్’ అనే ఇమేజ్‌ని సంపాదించిపెట్టాయి. అలా కెరీర్ లో దూసుకుపోతున్న టైంలో.. ఒక్కసారిగా సినిమాలు వరుస ఫ్లాప్ లు అయ్యాయి. దీంతో ఆయనకు సరైన ఛాన్సులు రాలేదనే వాదన అప్పట్లో గట్టిగా వినిపించింది.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య..
2012లో పెళ్లి చేసుకున్న ఉదయ్ కిరణ్.. వివాహ జీవితంలో కూడా ఇబ్బందులు పడినట్లుగా తెలిసింది. సినిమాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, పర్సనల్ రీజన్స్ కారణంగా.. ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీ నగర్ కాలనీలోని తన ఇంట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read: నటి శరణ్య పొనన్వన్నన్ పై కేసు నమోదు