Aamani: అమ్మ లేకుండా అక్కడికి రమ్మని పిలిచేవాళ్లు, చిరంజీవి గురించి కలలు కనేదాన్ని - ఆమని
Actress Aamani: ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ఆమని. ఇక తను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి మొదట్లో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి తాజాగా బయటపెట్టారు.
Actress Aamani: ఒకప్పుడు సీనియర్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి తల్లి పాత్రలు చేస్తున్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఆమని కూడా ఒకరు. దాదాపు ప్రతీ సౌత్ భాషలో సూపర్ హిట్లు అందుకున్నారు ఆమని. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత కూడా తల్లి పాత్రలతో బిజీగానే గడిపేస్తున్నారు. తాజాగా తను ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్లో ఎలా ఒప్పించారో బయటపెట్టారు ఈ సీనియర్ ఆర్టిస్ట్. అంతే కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదురైన కష్టాల గురించి కూడా బయటపెట్టారు.
సీరియస్ కాదు..
‘‘తమిళంలో కొంచెం క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అంత సీరియస్‌గా ఏం జరగలేదు. ఆఫీస్‌కు వెళ్లగానే వాళ్లు సినిమా తీసేవాళ్లా కాదా అని ఈజీగా తెలిసిపోతుంది. మాకు ఛాన్స్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. కానీ ముందుగా వాళ్లు సినిమా తీస్తారా లేదా అని ఒక రెండు, మూడు ఆఫీసులు తిరిగి చూసిన తర్వాత అర్థమయిపోయేది. అలా సినిమా తీయరు అనిపిస్తే తర్వాత రోజు వాళ్లు పిలిచినా వెళ్లేదాన్ని కాదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూడాలంటున్నారు రమ్మనేవాళ్లు కానీ అమ్మ లేకుండా రమ్మనేసరికి అర్థమయ్యేది. తెలుగులో నాకు అలాంటి సమస్యలు ఏమీ లేవు. చూడగానే ‘జంబలకిడి పంబకు’ సెలక్ట్ చేశారు’’ అని బయటపెట్టారు ఆమని.
నాన్నకు ఇష్టం లేదు..
తన తండ్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పుకొచ్చారు ఆమని. ‘‘అమ్మాయిలు అంటే ఇలాగే ఉండాలి అని నాన్న అనుకునేవారు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి. ఏదైనా సినిమా చూసి వస్తే అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా చేస్తున్నప్పుడు ఒకసారి అమ్మ చూసింది. అమ్మ దగ్గర ఉన్న చనువుతో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేశాను. కానీ నాన్న అంటే చాలా భయం. చెప్పిన తర్వాత కూడా ఆయన అస్సలు ఒప్పుకోలేదు. మంచిగా చదువుకో లేదా చదువు ఇంట్రెస్ట్ లేదంటే పెళ్లి చేస్తాం అన్నారు. ఆయనను ఒప్పించడానికి మూడు నెలలు పట్టింది. ఆ విషయంలో అమ్మ బాగా సపోర్ట్ చేసింది’’ అని గుర్తుచేసుకున్నారు.
ఎవరినీ లవ్ చేయలేదు..
తనకు, తన మైండ్‌సెట్‌కు సినిమాలు సెట్ అవ్వవని తన తండ్రి చెప్పేవారని తెలిపారు ఆమని. ‘‘నాన్న దాదాపు 45 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉన్నారు. నాతో సినిమాల గురించి ఓపెన్‌గా చెప్పలేకపోయారు. అమ్మకు చెప్తే బాధపడుతుందని ఆమెకు కూడా చెప్పలేదు. ఫైనల్‌గా ఒప్పుకున్నారు. ఆయన సాయంతోనే సినిమాల్లోకి వచ్చాను. తమిళంలో నాన్న ఫ్రెండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. అలా వచ్చిన కూడా నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి’’ అని చెప్పారు. ఇక ఇండస్ట్రీలో తాను ఎవరు లవ్ చేయలేదని కాకపోతే చిరంజీవి గురించి కలలు కనేదాన్ని అని బయటపెట్టారు. ఆయనకు పిచ్చి ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా కూడా దర్శకుడు మారడంతో తనను కూడా మార్చారని చెప్పారు ఆమని.
Also Read: 'ఢీ' నుంచి బాపు బొమ్మ అవుట్ - జడ్జి సీటులోకి కొత్తగా వచ్చిన హీరోయిన్ ఎవరంటే?