అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
రీల్ లైఫ్ విలన్ క్యారెక్టర్స్ పోషించినా... రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్.. పేద పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించబోతున్నాడు. త్వరలోనే బిల్డింగ్ నిర్మిస్తానని చెప్పాడు.
Sonusood : ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల ద్వారా సినిమాల్లో విలనే అయినా... రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు హీరో సోనూసూద్. ఇప్పుడు ఆయన మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. నిరుపేద పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించాలనే ఉద్దేశంతో వారి కోసం ఓ పాఠశాలను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు.
సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన సోనూసూద్.. కరోనా కాలంలో చాలా మందికి సాయం చేసి నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఆ సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వలస కూలీలను వారివారి ప్రాంతాలకు తరలించాడు. ఆ తర్వాత కూడా ఆ మంచి పనులను కంటిన్యూ చేశాడు. అంతే కాదు పేద పిల్లల కోసం ఓ పౌండేషన్ ను నెలకొల్పి, వారికి ఆర్థిక సహాయం కూడా అందించాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారికి మరో జీవితాన్ని ప్రసాదించి, వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాడు. అలా ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తూ సోనూసూద్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు.. అతన్ని రియల్ హీరోగా మార్చేశాయి.
సోనూసూద్ ను ఆదర్శంగా తీసుకుని కొందరు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఒకరు బిహార్‌లోని కతిహార్‌కు చెందిన బీరేంద్ర కుమార్ మహ. వృత్తి రిత్యా ఇంజినీర్ అయిన బీరేంద్ర కుమార్.. సోనూ సూద్ పేరు మీద ఒక స్కూల్‌ను నిర్మించారు. అందుకోసం తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. కేవలం అనాథ పిల్లల కోసమే నిర్మించిన ఈ పాఠశాల ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్.. ఇటీవలే ఆ ఇంజినీర్‌ను కలిశారు. ఈ పాఠశాలకు అనుబంధంగా మరో కొత్త భవనాన్ని నిర్మించి మరింత మంది నిరుపేద పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సోనూ సూద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌ను నిర్మిస్తున్నాడు.
View this post on Instagram
ఈ సందర్భంగా సోనూసూద్.. కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘బీరేంద్ర కుమార్ మహతోతో అనుబంధం కలిగి ఉన్నందుకు, బీహార్‌లో అనాథ పిల్లలకు ఆహారం, విద్యను అందిస్తున్నందుకు అతనికి కృతజ్ఞతలు. సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో - మేము విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము కొత్త పాఠశాల భవనాన్ని కూడా నిర్మిస్తాం’’ అంటూ సోనూసూద్ ఇన్స్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. ఈ పోస్టుపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కృషిని, మంచితనాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక సోనూసూద్ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం 'ఫతేహ్' మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. యాక్షన్ మూవీగా వస్తోన్న ఈ సినిమాను అభినందన్ గుప్తా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత 'కిసాన్' సినిమాలో నటించనున్నారు.
Read Also : Mahesh Babu On Krishna : తెలుగు సినిమా స్థాయి పెంచిన లెజెండ్ & విజనరీ నాన్నగారు - కృష్ణ జయంతికి మహేష్ లేఖ