Mahesh Babu On Krishna : తెలుగు సినిమా స్థాయి పెంచిన లెజెండ్ & విజనరీ నాన్నగారు - కృష్ణ జయంతికి మహేష్ లేఖ
Guntur Karam Movie - Krishna Jayanthi : ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, అగ్ర హీరో మహేష్ బాబు ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే...
''నాన్న గారి (సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని గారి) వీరాభిమానుల్లో నేనూ ఒకడ్ని'' అని మహేష్ బాబు (Mahesh Babu) పేర్కొన్నారు. ఈ రోజు కృష్ణ (Krishna Jayanthi). ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకుంటూ మహేష్ బాబు ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే....
నాన్న గారు సాహసి! - మహేష్ బాబు
''మా అభిమానులు అందరికీ సూపర్ స్టార్ కృష్ణ గారు పద్మాలయా బ్యానర్ మీద తీసిన ఎన్నో గొప్ప సినిమాల్లో 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా అంటే ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలను తలదన్నే స్థాయిలో ఒక సినిమా సినిమా నిర్మించి, విజయవంతం చేసిన సాహసి నాన్నగారు. యాభై రెండు ఏళ్ళ క్రితమే గుర్రాలు, గన్ ఫైటింగులు, భారీ సెట్టింగులు, బ్యూటిఫుల్ లొకేషన్స్, ట్రెజర్ హంట్, అతి పెద్ద తారాగణం, కౌబాయ్ గెటప్స్ తో బడ్జెట్ పరిథులు దాటి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు... ఇంగ్లీష్, హిందీ, తమిళ, బెంగాలీ వంటి అన్ని భాషల్లోనూ ఈ సినిమాను 50 దేశాల్లో చూపించిన ఘనత నాన్నగారిది'' అని మహేష్ బాబు తెలిపారు.
కృష్ణ జయంతి సందర్భంగా ఈ రోజు 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు మాట్లాడుతూ ''తెలుగు సినిమాకు ప్రతి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్ అండ్ విజనరీ నాన్నగారు. మొదటి స్టీరియో సౌండ్, మొదటి స్కోప్, మొదటి 70ఎంఎం, మొదటి జేమ్స్ బాండ్, మొదటి కౌబాయ్... ఇలా అన్ని కొత్త హంగుల్ని తెలుగు సినిమాలకు తెచ్చి, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన నాన్న గారి జ్ఞాపకార్థం మనందరం మళ్ళీ 'మోసగాళ్లకు మోసగాడు; చిత్రాన్ని డిజిటల్ లో కొత్త సాంకేతిక విలువలతో చూసి ఆ ఆనందాన్ని, అనుభూతిని పొంది ఆయన్ను స్మరించుకుందాం'' అని మహేష్ బాబు పేర్కొన్నారు.
కృష్ణ జయంతికి 'గుంటూరు కారం'
తండ్రి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది తన సినిమాకు సంబంధించిన ఒక కొత్త కబురు చెప్పడం మహేష్ బాబుకు అలవాటు. ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'గుంటూరు కారం' వీడియో గ్లింప్స్ విడుదల చేస్తున్నారు.
Also Read : తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!
కృష్ణ జయంతి సందర్భంగా 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రాన్ని 4K ఫార్మెటులో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ఈ రోజు సాయంత్రం 06.03 గంటలకు వీడియో గ్లింప్స్ విడుదల కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని యూట్యూబ్ ఛానల్ 06.39 గంటలకు విడుదల కానుంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో 'అతడు', 'ఖలేజా' తర్వాత రూపొందుతున్న చిత్రమిది. దీనికి ముందుగా 'అమరావతికి అటు ఇటు' టైటిల్ పరిశీలనలో ఉందని వినిపించింది. మధ్యలో 'ఊరికి మొనగాడు' టైటిల్ కూడా రేసులోకి వచ్చింది. ఆ రెండూ కాదని 'గుంటూరు కారం'కు హీరో, దర్శకుడు ఓటు వేశారు. సాధారణంగా 'అ' అక్షరంతో మొదలయ్యే పేర్లకు కొన్నాళ్లుగా త్రివిక్రమ్ ప్రాముఖ్యం ఇస్తూ వస్తున్నారు. అది ఆయన సెంటిమెంట్. మరి, ఈసారి ఆ సెంటిమెంట్ పక్కన పెట్టినట్టే!
Also Read : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.