Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!
'భారతీయాన్స్'కు మాజీ సైనికుల నుంచి ప్రశంసలు లభించాయి. సినిమా చూసి వాళ్ళు ఉద్వేగానికి గురి అయ్యారు. మరోవైపు సెన్సార్ అధికారుల తీరుపై నిర్మాత శంకర్ నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నీరోజ్ పుచ్చా (Nerroze Putcha), సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ కథానాయకులుగా నటించిన సినిమా 'భారతీయాన్స్' (Bharateeeyans Movie). 'ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా', 'లాహిరి లాహిరి లాహిరిలో' తదితర విజయవంతమైన చిత్రాలకు రచయితగా పని చేసిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ కథానాయికలు. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు.
మొన్న క్రికెటర్ డివిలియర్స్...
ఇప్పుడు మాజీ సైనికాధికారులు
భారత్ - చైనా సరిహద్దుల్లో గల్వాన్ ఘటన ఆధారంగా, భారతీయ సైనికుల వీరోచిత పోరాట పటిమ స్ఫూర్తితో 'భారతీయాన్స్' రూపొందింది. ఇటీవల సినిమా టీజర్ చూశానని, నీరోజ్ పుచ్చా హీరోగా పరిచయం అవుతున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉందని క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నారు. ఇప్పుడు త్రివిధ దళాల్లో పని చేసిన మాజీ సైనికాధికారులు చిత్రాన్ని మెచ్చుకున్నారు. వాళ్ళ కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.
చైనా నీచ బుద్ధి ఎండగడుతూ రూపొందిన 'భారతీయన్స్' సంచలన విజయం సాధించాలని మాజీ సైనికాధికారులు శ్రీనేష్ కుమార్ నోరి, కెప్టెన్ సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు కోరుకున్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు.
చైనా పేరు తీసేయమన్నారు...
ఎందుకో తెలియడం లేదు!
చిత్ర నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ ''భారత సైనికుల ప్రాణాలు బలి తీసుకుంటూ... మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే నీచ చర్యలకు పాల్పడుతున్న చైనా పేరును తొలగించాలని సెన్సార్ సభ్యులు తమకు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయంలో మేం ఎంత దూరం వెళ్ళడానికి అయినా సిద్ధంగా ఉన్నాం. త్రివిధ దళాల్లో పనిచేసిన సైనికాధికారులు 'భారతీయన్స్' చూసి మెచ్చుకోవడం మా చిత్ర బృందానికి ఎంతో గర్వంగా ఉంది'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుల్లో ఒకరైన కపిల్ కుమార్, హీరోల్లో ఒకరైన నీరోజ్ పుచ్చా ఫాదర్ రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Also Read : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు...
సెన్సార్ పూర్తి అయ్యాక సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. ఇతర భాషల్లో అనువదించి పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం 'భారతీయాన్స్'ను గొప్ప నేత, మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చూశారు. ప్రీమియర్ షో చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ''దేశభక్తితో కూడిన చిత్రమిది. భారత దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి ఇటువంటి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారు. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రాన్ని యువత, ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. ఈ చిత్రానికి పోరాటాలు : జూడో రాము, కూర్పు : శివ సర్వాణి, ఛాయాగ్రహణం : జయపాల్ రెడ్డి నిమ్మల, సంగీతం : సత్య కశ్యప్ & కపిల్ కుమార్.
Also Read : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!