Bigg Boss 18: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు... 'బిగ్ బాస్'కు కొత్త హోస్ట్, ఎవరు వచ్చారో తెలుసా?
సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్ 18' నుంచి హోస్ట్ గా తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా ఎదురైన బెదిరింపుల నేపథ్యంలో ఆయన ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం.
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కి చాలా కాలం నుంచి హత్య బెదిరింపులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 18' నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంత వివాదాస్పదమవుతుందో అంతే టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తుంది కూడా. ఇక 'బిగ్ బాస్'కు హోస్టుగా వ్యవహరించే హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. తెలుగులో గత కొన్ని సీజన్ల నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తూ, బిగ్ బాస్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. నిజానికి ఈ షో రెగ్యులర్ ఎపిసోడ్ ల కంటే ఎక్కువగా, వీకెండ్ లో నాగార్జున వచ్చే ఎపిసోడ్లకే మంచి రెస్పాన్స్ దక్కుతుంది. నాగార్జున బుల్లితెరపై కనిపించే వీకెండ్ ఎపిసోడ్ కోసమే ప్రేక్షకులు వీక్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక హిందీలో అచ్చం సల్మాన్ ఖాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.
ప్రస్తుతం హిందీలో 'బిగ్ బాస్ సీజన్ 18' నడుస్తోంది. చాలా సీజన్ల నుంచి సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఐకానిక్ బాలీవుడ్ సూపర్ స్టార్ తాజాగా ఈ షో నుంచి తప్పుకుని షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ బదులు మరో సెలబ్రిటీ బిగ్ బాస్ హోస్ట్ గా సందడి చేయబోతున్నారని సమాచారం. సల్మాన్ ఖాన్ కి సంబంధించిన భద్రతాపరమైన సమస్యల కారణంగా ఆయన షో నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ వీకెండ్ జరిగే 'బిగ్ బాస్ 18' వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో సల్మాన్ ఖాన్ బదులు ఫరాఖాన్ హోస్ట్ గా చేయబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా ముంబైలోని బిగ్ బాస్ షూటింగ్ లొకేషన్లో ఓ వ్యక్తి భయాందోళనలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్లో సల్మాన్ ఖాన్ ను చూడడానికి తనను అనుమతించట్లేదనే కోపంతో, సదరు వ్యక్తి "లారెన్స్ బిష్ణోయ్ ని పిలవాలా?" అంటూ అరవడం అక్కడున్న అందరినీ టెన్షన్ పెట్టింది. ఈ ఘటన తర్వాత పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ అతను సల్మాన్ ఖాన్ అభిమాని అని, తనను సల్మాన్ ను చూడడానికి అనుమతించట్లేదనే కోపంతో అలా అన్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిజానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న హత్యా బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ 'బిగ్ బాస్ 18' షోకి హోస్ట్ గా వ్యవహరించే అవకాశం లేదని వార్తలు వచ్చాయి.
కానీ ఆశ్చర్యకరంగా ఇన్ని బెదిరింపులు ఎదురవుతున్నప్పటికీ సల్మాన్ తన సినిమా షూటింగ్ లను, అలాగే బిగ్ బాస్ షూటింగ్ ను ఆపలేదు. కానీ తాజాగా జరిగిన సంఘటనతో ఆయన షో నుంచి తప్పుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. మరి ఈ షో నుంచి సల్మాన్ పూర్తిగా తప్పుకున్నట్టేనా? లేదా కొంతకాలం ఆగి రీఎంట్రీ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా 1998లో కృష్ణ జింకను వేటాడిన కేసు కారణంగా లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ పై పగబట్టిన సంగతి తెలిసిందే.
Also Read: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?