Bholaa Shankar Screening: ఏపీలో ‘భోళా శంకర్’కు తప్పని తిప్పలు- ప్రదర్శన నిలిపివేసిన పోలీసులు!
ఆంధ్రాలో మెగాస్టార్ మూవీ ‘భోళా శంకర్’కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే టికెట్ల ధరల పెంపునకు సర్కారు అనుమతి ఇవ్వకపోగా, తాజాగా పోలీసులు చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెరకెక్కింది. మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. భారీ అంచనాల నడుమ(ఆగష్టు11న) విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఏపీలో ‘భోళా శంకర్’కు తిప్పలు
ఇక ఏపీలో మెగాస్టార్ మూవీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వకపోగా, కొన్ని చోట్ల ప్రదర్శనకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా బాపట్లలో ఈ సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. ఓ థియేటర్ లో నిర్ణీత ధరకంటే ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారని తెలియడంతో అధికారులు చర్యలకు దిగారు. సినిమా ప్రదర్శన ఆపడంతో పాటు థియేటర్ యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై పరిమితి కొనసాగుతోంది. సింగిల్ స్క్రీన్ లతో పాటు మల్టీప్లెక్స్ ల విషయంలో అధికారులు టికెట్ల ధరలు నిర్ణయించారు. థియేటర్ నిర్వాహకులు అదే ధరలకు టికెట్లను విక్రయించాలి. అయితే, ‘భోళా శంకర్’ సినిమా విషయంలో ముందుగా నిర్ణయించిన ధరల కంటే ఎక్కు ధరలకు టికెట్లు విక్రయించే థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశారు.
టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వని ఏపీ సర్కారు
‘భోళా శంకర్’ సినిమాకు సంబంధించి తెలంగాణ సర్కారు టిక్కెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఏపీ సర్కారు మాత్రం సరైన పత్రాలు సమర్పించలేదనే కారణంగా టిక్కెట్ల ధర పెంపుకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఓ ప్రకటన చేసింది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి సర్కారు నిర్ణయించిన సుమారు 11 పత్రాలను చిత్ర నిర్మాతలు సమర్పించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి అనుమతి లేనట్లేనని వెల్లడించింది. రూ. 100 కోట్లకుపైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాతలు చెప్పినా, అవసరమైన పత్రాలను ఇవ్వలేదని తెలిపింది. అంతేకాదు, ఏపీలో ఈ సినిమా షూటింగ్ 20 శాతం కొనసాగినట్లు ఆధారాలు ఇవ్వలేదని చెప్పింది. పూర్తి వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. సినీ రంగానికి సంబంధించి ఎలాంటి వివక్ష లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు లోబడి డాక్యుమెంట్లు చూపించి టిక్కెట్టు ధరలను పెంచుకోవచ్చని సూచించారు.
View this post on Instagram
Read Also: ‘శాకుంతలం’ కోసం అలా, 'ఖుషి' కోసం ఇలా- సమంత మౌనం వెనుక కారణం ఏంటి?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial