Adipurush Release: నేపాల్‌లో ‘ఆదిపురుష్’ మార్నింగ్ షోలు రద్దు, సీతమ్మే కారణం!
నేపాల్ రాజధాని ఖాట్మండులో ‘ఆదిపురుష్’ మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఈ చిత్రంలో సీత గురించి చెప్పే ఒక డైలాగ్ పట్ల అక్కడి ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాలతో సినిమా షోలు క్యాన్సిల్ అయ్యాయి.
దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ఆదిపురుష్’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ సినిమా ప్రదర్శించే అన్ని థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.
నేపాల్ లో ‘ఆదిపురుష్‘కు ఇబ్బందులు
అయితే, నేపాల్ రాజధాని ఖాట్మండులో మాత్రం ‘ఆదిపురుష్’ సినిమాకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. ఈ సినిమాలో ఉన్న ఓ డైలాగ్ పై అక్కడి ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీత గురించి చెప్పే ఆ డైలాగ్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అంతేకాదు, ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్ బాలేంద్ర షా నేపాల్ రాజధానిలో ‘ఆదిపురుష్’తో పాటు ఈ హిందీ చిత్రాలను ప్రదర్శించకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇతిహాసమైన రామాయణానికి సంబంధించిన ‘ఆదిపురుష్’ సినిమాలో సీత గురించి చెప్పే డైలాగ్ ను తొలగించే వరకు సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
నేపాల్ అభ్యంతరం ఏంటి?
‘ఆదిపురుష్’ చిత్రంలో 'జానకి ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ఇండియా' అనే డైలాగ్ ఉంటుంది. ఈ లైన్‌ను నేపాల్ తో పాటు భారత్ లోనూ తొలగించే వరకు, ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీలో హిందీ సినిమాలను అనుమతించబోమని బాలేంద్ర తన ఫేస్‌బుక్ వాల్‌లో రాశారు. నేపాల్ సెన్సార్ బోర్డ్ కూడా మేకర్స్ ను ఈ డైలాగ్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మేకర్స్ ఆ లైన్‌ను తీసివేస్తే తప్ప ‘ఆదిపురుష్’ను నేపాల్ లో విడుదల చేయకూడదని తేల్చి చెప్పింది. నేపాల్ సెన్సార్ ప్యానెల్ స్థానిక నమ్మకం ప్రకారం, సీతాదేవి నేపాల్‌లో జన్మించిందని భావిస్తున్నారట. అయితే, ఈ చిత్రంలో సీతాదేవి భారతదేశపు కుమార్తెగా అభివర్ణించే ఓ నిర్దిష్ట సన్నివేశంపై నేపాల్ సెన్సార్ ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మేకర్స్ కచ్చితంగా ఈ డైలాగ్‌ను తొలగించాలని సూచించిందట. లేదంటే సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వబోమని తేల్చి చెప్పిందట.
డైలాగ్ తొలగింపునకు చిత్రబృందం అంగీకారం
ముఖ్యమైన సన్నివేశంలో సీత గురించి చెప్పే డైలాగ్ తొలగించేందుకు సినిమా యూనిట్ కాస్త వెనుకడుగు వేసినా, తీసేస్తేనే సినిమా విడుదలవుతుందని సెన్సార్ సభ్యులు తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గక తప్పలేదట. చివరకు ఆ డైలాగ్ తీసేస్తామని చిత్రబృందం చెప్పడంతో సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారట. సినిమా విడుదలకు ఉన్న అభ్యంతరాలు పూర్తిగా తొలగిపోయాయట. నేపాల్ లోనూ ఈ సినిమా విడుదలైంది. భారత్ లో మాదిరిగానే అక్కడ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా మార్నింగ్ షోలు రద్దు చేయబడ్డాయి.
‘ఆదిపురుష్’ సినిమా గురించి..
రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్‘. ప్రభాస్ హీరోగా, కృతిసనన్ హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు.
Read Also: 'ఆదిపురుష్'పై నెగటివ్ రివ్యూ - యువకుడిని చితకబాదిన అభిమానులు