Nayanthara: భర్తకు అవమానం - ఆ హీరో సినిమాల్లో ఇక నటించనని నయనతార వెల్లడి!
హీరోయిన్ నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై అజిత్ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పారు. తన భర్తకు జరిగిన అవమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నయనతార. సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో ఫుల్ కెరీర్ ఫుల్ బిజీగా గడుపుతోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటిన ఈ మద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్‘ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు తమిళ యంగ్ హీరో అట్లీ దర్శకత్వ వహిస్తున్నాడు. అయితే, తాజాగా నయనతార సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళ స్టార్ హీరో అజిత్ తో కలిసి ఇకపై సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పింది. నయనతార నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉందట.
విఘ్నేష్ కు షాకిచ్చిన అజిత్
‘పోడాపోడి‘ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నయనతార భర్త విఘ్నేష్ శివన్. ఆ తర్వాత ‘నానుమ్ రౌడీదాన్’ ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అజిత్ తో కలిసి ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఈనెల(ఫిబ్రవరి) మొదటి వారంలోనే సెట్స్ మీదకు వస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ, చివరి క్షణంలో విఘ్నేష్ శివన్ కు అజిత్ షాక్ ఇచ్చారట. విఘ్నేష్ శివన్ చెప్పిన కథ అజిత్ తో పాటు లైకా సంస్థకు కూడా నచ్చలేదట. దీంతో కథలో కొన్ని మార్పులు చేయాలని అజిత్ సూచించాడట. దానికి విఘ్నేష్ నో చెప్పడంతో సినిమా చేయనని అజిత్ చెప్పాడట.
అజిత్ సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పిన నయనతార!
ఈ నేపథ్యంలో స్వయంగా నయనతార రంగంలోకి దిగిందట. ఈ ప్రాజెక్టును ఎలాగైనా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిందట. ఆమె అజిత్ తో పాటు, లైకా సంస్థకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసిందట. కానీ, కథలో మార్పులు చేసే వరకు సినిమా చేయనని అజిత్ చెప్పారట. ఈ నేపథ్యంలో నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఇకపై అజిత్ తో సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పిందట. తన భర్తను అవమానించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇకపై లైకా సంస్థతోనూ సినిమాలు చేయబోనని చెప్పినట్లు తెలుస్తోంది.
సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించిన నయన్, అజిత్
నయనతార, అజిత్ కలిసి తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించారు. ‘బిల్లా’, ‘ఆరంభం’, ‘విశ్వాసం’ లాంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇద్దరు చక్కటి సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. కానీ, నయనతార తాజా నిర్ణయంతో ఇకపై ఇద్దరు కలిసి సినిమాలు చేసే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయం తెలుసుకుని సినీ అభిమానులు తెగ బాధపడుతున్నారట. అయితే, నయనతార నిర్ణయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతోంది.