Srikanth - Uha: అవన్నీ ఫేక్ వార్తలు, వాళ్ళని ఊరికే వదలకూడదు: హీరో శ్రీకాంత్
సెలబ్రెటీల వ్యక్తిగత, వైవాహిక జీవితాలపై వార్తలు కుప్పలుతెప్పలుగా వస్తుంటాయి. తాజాగా హీరో శ్రీకాంత్ దంపతులకు సంబంధించి అలాంటి వార్త ఒకటి వచ్చింది.
ప్రస్తుత కాలంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువగా ఉంటోంది. ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. అలాగే సోషల్ మీడియాలో నిరాధార వార్తలకు కొదవే లేదు. కాదేదీ కాంట్రవర్సీకి అనర్హం అన్న చందంగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి ఇలాంటి వార్తలు ఎక్కువగా చూస్తుంటాం. అందులోనూ సెలబ్రెటీల వ్యక్తిగత, వైవాహిక జీవితాలపై వార్తలు కుప్పలుతెప్పలుగా వస్తుంటాయి. తాజాగా హీరో శ్రీకాంత్ దంపతులకు సంబంధించి అలాంటి వార్త ఒకటి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గత కొన్ని రోజులుగా హీరో శ్రీకాంత్ ఆయన భార్య ఊహ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఎంతో ఆనందంగా వైవాహిక జీవితం గడుపుతూ అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న ఈ జంట విడాకులు తీసుకునేంత సమస్య ఏమొచ్చిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఆర్థిక సమస్యలు కారణంగా విడాకులు తీసుకుంటున్నారంటూ కొన్ని వెబ్ సైట్స్, యుట్యూబ్ ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ వార్తలు ప్రజల్లోకి వెళ్లి.. చర్చనీయాంశంగా మారాయి. అటు ఇటు తిరిగి ఈ వార్తలు శ్రీకాంత్ చెవిన పడటంతో ఆ పుకార్లపై ఆయన స్పందించారు. తన ఫ్యామిలీ పై వస్తోన్న వార్తలను శ్రీకాంత్ ఖండించారు.
ఈ మేరకు శ్రీకాంత్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను అంటూ ఫైర్ అయ్యారు శ్రీకాంత్. గతంలో తాను చనిపోయినట్లుగా కూడా ఒక ఫేక్ వార్తను క్రియేట్ చేశారని, దాంతో తన కుటుంబం ఆందోళనకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు తాము ఆర్థిక ఇబ్బందులు కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లుగా తప్పుడు వార్తలను పుట్టించారని మండిపడ్డారు. కొన్ని వెబ్ సైట్ లలో వచ్చిన వార్తలు తన భార్య ఊహ దగ్గరకు వెళ్లడంతో ఆమె కంగారు పడి ఆ వార్తలను తనకు చూపించి బాధపడిందని చెప్పారు. ఇలాంటి వార్తలను నమ్మొద్దని, ఆందోళన పడవద్దని ఊహను ఓదార్చానని పేర్కొన్నారు.
ఇలా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో తమ బంధుమిత్రులు ఫోన్ లు చేసి అడుగుతున్నారని, వారికి వివరణలు ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా ఉందని వాపోయారు. ప్రస్తుతం తాము చెన్నై నుంచి వచ్చి అరుణాచలం దైవ దర్శనానికి వెళ్తున్నామని, ఇలాంటి సమయంలో ఈ వార్తలు స్ప్రెడ్ అవ్వడం ఎంతో అసహనానికి గురి చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. తన మీదే కాకుండా చాలామంది సెలబ్రెటీలపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా శ్రీకాంత్ ఊహ విడాకులపై వస్తోన్న వార్తలకు స్వయంగా శ్రీకాంత్ వివరణ ఇవ్వడంతో ఆ ఫేక్ వార్తలకు తెర పడింది.
View this post on Instagram