AP NDA Manifesto : 30వ తేదీన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో - సూపర్ సిక్స్‌ను మించి హామీలు
Elections 2024 : ఏపీలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను 30వ తేదిన విడుదల చేయనుంది. కొన్ని జనాకర్షక హామీలను ప్రకటించే అవకాశం ఉంది.
NDA alliance in AP will release the joint manifesto : ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను 30వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. ఓటింగ్ మరో పదమూడు రోజుల్లో జరగనుంది. ఇప్పటికే వైసీపీ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. భారీ హామీలు ఏమీ ఇవ్వకుండా సింపుల్ గా మేనిఫెస్టోను వైసీపీ అధినేత విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నారు.
సూపర్ సిక్స్ పథకాలకు అదనపు హామీలు తోడు
టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలకు అదనంగా ఆకర్షణీయమైన హామీలను జత చేస్తున్నారు. 2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలను కలిపి మేనిఫెస్టోలో హామీైలు ఇవ్వనున్నారు. మేనిఫెస్టో అంశాలపై మూడు పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని... సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి నేతలు ప్రకటించే అవకాశం ఉంది.
ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేలా కార్యక్రమాలు
వచ్చే ఐదేళ్లలో ఇచ్చే సంక్షేమం.. చేసే అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పథకాలకు నిథుల సమీకరణపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని పటాపంచలు చేసేలా.. ఆదాయ పెంపుమార్గాలను కూడా చెప్పే అవకాశం ఉంది . వైసీపీ మేనిఫెస్టోలో భారీ హామీలు లేకపోవడంతో కూటమికి పని మరితం సులువు అయింది. వైసీపీ రుణమాఫీ వంటి హామీలను ప్రకటించి ఉన్నట్లయితే.. పోటీగా కూటమి కూడా ప్రకటించాల్సి వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి కొత్త హామీైలు ఏమీ ఇవ్వకపోవడంతో ఎన్డీఏ కూటమి కూడా భారీ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయిందనుకోవచ్చు.
అమరావతిని రాజధానిగా ప్రకటించే అవకాశం
వైసీపీ మేనిపెస్టోలో మూడు రాజధానుల అంశం పెట్టారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో అమరావతి రాజధానినే ప్రకటించే అవకాశం ఉంది. వికేంద్రీకరణ అభివృద్ధితో ఒకే రాజధానిని ప్రకటించనున్నారు. అలాగే కొన్ని పాలనా పరమైన అంశాలపైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వృద్ధుల పెన్షన్లను రూ. నాలుగు వేలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.