Jubilee Hills By-elections : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంతుచిక్కని ఓటర్ల మనోగతం-ఈసారి హిస్టరీ రిపీట్ అవుతుందా? లేదా..?
Jubilee Hills By-elections : తెలంగాణ రాష్ట్రమంతా ఓలెక్కల.. జూబ్లీహిల్స్ మరో లెక్క అంటున్నారు అక్కడి ఓటర్లు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మా వ్యూహాలు మావంటూ వినూత్న తీర్పులిచ్చారు.

Jubilee Hills By-elections : తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ ఎస్, బీజేపి కోటి ఆశలు పెట్టుకున్నాయి. భవిష్యత్ వ్యూహాలకు ఈ ఫలితాలే ఊతం కాబోతున్నాయి. ఇక్కడ గెలుపు లెక్కలు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆయా పార్టీల భవిష్యత్ ను డిసైడ్ చేయబోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ పని తీరుకు కొలమానం కాబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు రేటింగ్ ఇవ్వబోతున్నాయి. ఇంతలా ఉత్కంఠ కలిగిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు లెక్కలపై ఓక్లారిటీ రావాలంటే గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలపై ఓ లుక్కేయాల్సిందే. వివరాల్లోకి వెళితే..
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ నుంచి విడిపోయిన ప్రత్యేక నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ఏర్పడింది. 2009లో అప్పటి ఎమ్మెల్యే పీజేఆర్ మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలు రావడంతో పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీచేయడం, తండ్రికి ఉన్న అపారమైన పొలిటికల్ మైలేజ్, మాస్ ఫాలోయింగ్ తోడు సానుభూతి కలిసిరావడంతో విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత 2014లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి పొత్తులో భాగంగా టీడీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ 30.78శాతం ఓట్ షేర్‌తో అంటే 50,898 ఓట్లు సాధించారు.ఇదే ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధిగా బరిలోకి దిగిన నవీన్ కుమార్ యాదవ్ 25.19 ఓట్ షేర్ తో 41,656 ఓట్లు సాధించి రెండో స్ధానంలో నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే మాగంటి గోపీనాథ్‌కు గట్టిపోటీ ఇచ్చారు నవీన్ కుమార్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపడుతున్నారు.
2014 ఎన్నికల తరువాత టీడీపీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు మాగంటి గోపీనాథ్. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, ఎంఐఎం పొత్తులో భాగంగా తిరిగి ఇదే నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీపడ్డారు. 44.3శాతం ఓట్ షేర్‌తో 68,979 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా రెండోసారి జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 52,975 ఓట్లతో రెండవ స్ధానానికి పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీపడ్డ నవీన్ కుమార్ 18,817 ఓట్లతో మూడవ స్ధానంలో నిలిచారు. ఇలా 2014 ఎన్నికల్లో ఎంఐఎం ,బీఆర్ ఎస్ ఉమ్మడి అభ్యర్ధిగా పోటీచేయడంతో ఓట్ షేర్ భారీగా పెరిగింది.
2023 ఎన్నికల్లో మూడోసారి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో నవీన్ కుమార్ కాంగ్రెస్ సీటు కోసిన విశ్వప్రయత్నాలు చేసినా, ఫలితం లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు బీఆర్ ఎస్ అభ్యర్ధి మాగంటి గోపీనాథ్. ఇలా గడచిన ఎన్నికల్లో బీఆర్ ఎస్ 43.94శాతం ఓట్ షేర్ సాధించి గెలుపొందితే, 35. 03శాతం ఓటింగ్ శాతం సాధించి రెండోస్థానంలో నిలిచింది.
ఇలా 2009 నుండి 2023 ఎన్నికల వరకూ జూబ్లీహిల్స్ లో ఫలితాల సరళిని ఓ సారి పరిశీలిస్తే, ఎంఐఎంతో దోస్తీ కట్టిన, లేదా బలపరిచిన పార్టీ అభ్యర్ధి విజయం సాధించడం జరుగుతోంది. ఇలా మాగంటి గోపీనాధ్ ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. 2014లో ఎఐఎం అభ్యర్ధిగా నిలబడ్డ నవీన్ కుమార్ యాదవ్ సైతం దాదాపు గెలుపుకు చేరువలోకి వెళ్లిన పరిస్ధితి. ఇలా ఎంఐఎం ప్రాబల్యం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. మాగంటి గోపీనాధ్ అకాల మరణం తరువాత తాజాగా జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ కుమార్ కు ఎంఐఎం మద్దతు తెలుపుతోంది. బీఆర్ ఎస్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది.బీజేపి సైతం సింగిల్ గా గెలుపు అదృష్టం పరీక్షించుకోబోతోంది.
ఎంఐఎం అండ దండిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ కుమార్ గెలుపొందితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హిస్టరీ మళ్లీ రిపీట్ అయినట్లే. అలా కాకుండా బీఆర్ ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత విజయం సాధించినా, లేక బీజేపి అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గెలుపొందినా, వీరిద్దరిలో ఎవరు గెలిచినా, ఇక్కడ ఎంఐఎం హవాకు బ్రేక్ పడినట్లేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలు సైతం ఈ ఉపఎన్నికల్లో ఓటర్ల పల్స్ అందక అయోమయంలో ఉన్నాయట, పైకి మాదే విజయం అనే ధీమాతో ఉన్నా లోలోపల మాత్రం నరాలు తెగే టెన్షన్ వెంటాడుతోందట





















