Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Jubilee Hills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిపోతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వెంగళరావ్ నగర్ డివిజన్లో నవీన్ యాదవ్ తరఫున ఆయన ప్రచారం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో బీఆర్ఎస్ కథ పరిసమాప్తం కాబోతోందని జోస్యం చెప్పారు. నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంగళరావునగర్ డివిజన్‌లో ప్రచారం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఈ ఉపఎన్నికలో ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వాలన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అనుసరిస్తున్న కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. హైదరాబాద్‌ను మినీ ఇండియాగా అభివర్ణించిన ఆయన, సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టితో పని చేస్తున్నారని కొనియాడారు. నవీన్ యాదవ్‌కు ఓటు వేయడం ద్వారా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అన్నారు. నవీన్ యాదవ్ స్థానికుడని, ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండటం నియోజకవర్గానికి మరింత మేలు చేస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని నమ్మకం ఉందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు 46 వేల మంది చిన్నారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పార్టీలో మంత్రుల మధ్య విభేదాలపై వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ, అది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పార్టీ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కుటుంబాలకు తగిన అవకాశాలు వస్తాయి. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉండాలని, ఆ తర్వాత కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రం వైఖరిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు చోరీ జరిగిందంటున్నారు. గత 10 ఏళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. మరి ఓట్ చోరీ ఎవరు చేశారో చెప్పాలి. ఈ అంశంపై తొలుత ఫిర్యాదు చేసింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలన్నారు.






















