Vote from home : వోట్ ఫ్రం హోం చాన్స్ ఇలా ఉపయోగించుకోండి - మీ ఇంట్లో పెద్దలుంటే వెంటనే అప్లయ్ చేయండి !
Election News : వోట్ ఫ్రం హోమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 15 ఏప్రిల్ చివరి తేదీ. ఓటు వేయడానికి పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లలేని పెద్దల కోసం ఈ ఏర్పాటు చేశారు.
15th April is the last date to apply for vote from home : ఎన్నికల ప్రక్రియలో భాగంగా వోట్ ఫ్రం హోం సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నడవలేదని వృద్ధులు.. దివ్యాంగుల కోసం ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. 85 ఏళ్లు నిండి నడవలేని స్థితిలో ఉన్న వృద్దులు.. 40 శాతం అంగ వైకల్యం ఉన్న వారు.. నడవలేని దివ్యాంగులకు ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చు. వారి ప్రజాస్వామ్య హక్కును ఓటు రూపంలో వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా అమలవుతోంది.
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18వ తేదీన విడుదల అవుతోంది. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29తో పూర్తి కాగానే మే 13వ తేదీలోపు ఎప్పుడైనా ఎన్నికల అధికారులు, ఉద్యోగులు కలిసి ఓటు కోసం వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్తారు. ముందుగానే ఎప్పుడు వస్తారు.. ఎన్ని గంటలకు వస్తారు అనే విషయాలను ఆ ఓటర్ల ఇంటికి ఫోన్ల ద్వారా అధికారులు తెలియజేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల ఓటర్ల పేర్లను ప్రత్యేకంగా సచివాలయాల వద్ద డిస్‌ప్లే చేస్తారు. ఇళ్ల వద్ద ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో వారి పూర్తి వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
ఓటు నమోదుకు ఈ నెల 15 ఆఖరు తేదీ. 18 ఏళ్లు నిండిన వారు ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు ఏప్రిల్ 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా తాహశీల్దారు, మునిసిపల్ కార్యాలయాల్లో మాన్యువల్‌గా కూడా ఫారమ్ నంబర్ 6ను అందజేయొచ్చు. అయితే వయసు నిర్థారణకు సంబంధించిన సర్టిఫికేట్.. ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. నిబందనల ప్రకారం.. ఓటు ఫ్రం హోం అవకాశం ఉన్న వారి కుటుంబసభ్యులు ఈ అంశంపై అవగాహన పెంచుకుని దరఖాస్తు చేసుకుంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.
ఓటును బలవంతంగా పలానా పార్టీకి అధికారులు వేయించారు అనే అపవాదులు మూట గట్టుకోకుండా ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎవరైతే ఇంటి వద్ద ఓటు వేస్తారో వారికి సంబంధించిన వివరాలను ఫారమ్ నంబర్ 12డిలో ఇప్పటికే బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా సేకరించారు. వారం రోజుల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి అయ్యింది. పూర్తి చేసిన 12డి ఫారాలను రిటర్నింగ్ అధికారికి మండల స్థాయి అధికారులు అందజేశారు. వృద్ధులు, దివ్యాంగుల నుంచి ఓటు తీసుకొనే సమయంలో భద్రత కోసం ఒక టీమ్‌ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఆ టీమ్‌లో పోలీసులు కూడా ఉంటారు. ఆ టీమ్ ఓటర్ల ఇంటికి వెళ్లినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వీడియో కూడా తీస్తారు. అక్కడ ఓటరు ఓటు వేసేటప్పుడు మాత్రం వీడియో తీయడానికి వీల్లేదు. అది రహస్యంగానే ఉంటుంది. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్‌ను పద్ధతి ప్రకారం మడత వేసి బాక్స్‌లో వేస్తారు. ఆ బ్యాలెట్ బాక్స్‌ను పోలీసుల భద్రత మధ్య బిఎల్‌వో నేతృత్వంలో రిటర్నింగ్ అధికారికి అందిస్తారు.