YS Vivekananda Reddy Murder: చాలా అవమానంగా ఉంది... వివేకా హత్య కేసును త్వరగా పరిష్కరించండి... సీబీఐని కోరిన సీఎం మేనమామ
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిని సీబీఐ విచారించింది. కేసును త్వరగా పరిష్కరించాలని సీబీఐని కోరానని రవీంద్రనాథరెడ్డి అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మేనమామ సీబీఐ ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు శనివారం సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని విచారించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో శనివారం సాయంత్రం గంటపాటు విచారించినట్లు సమాచారం. పులివెందులకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తిని కూడా అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం స్పందించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి... చాలా అవమానంగా ఉందని, వివేకా హత్య కేసును త్వరగా పరిష్కరించాలని సీబీఐ అధికారులను కోరారని తెలిపారు.
త్వరగా పరిష్కరించాలని కోరాను
వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు చేపట్టిన విచారణ 90వ రోజుకు చేరింది. తొలిసారిగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు టీడీపీ నేతలపైఈయన ఆరోపణలు చేశారు. విచారణ అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా బంధువు, రాజకీయ నాయకుడిని కావడంతో విచారణకు పిలిచారని పేర్కొన్నారు. వివేకాతో ఎలాంటి సంబంధాలున్నాయి, ఆయన మీతో ఎలా ఉండేవారని ప్రశ్నించారని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే అందరినీ ప్రశ్నించడం ద్వారా ఏదైనా సమాచారం దొరుకుతుందనే భావనతో విచారణకు పిలిపిస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కేసు త్వరగా తేల్చడానికి ప్రయత్నిస్తామని అధికారులు చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.
చెప్పుల దుకాణం యాజమానిని కూడా
అంతకుముందు పులివెందులకు చెందిన వెంకటరమణ అనే వృద్ధుడ్ని సైతం అధికారులు విచారించారు. పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సీబీఐ అధికారులు చెప్పుల దుకాణం యజమాని మున్నా, ఆయన భార్య రజియాను పలు ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించారు. గతవారం పులివెందులకు చెందిన ఉమాశంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు. కొద్ది రోజుల క్రితం సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ... కోర్టు అనుమతితో విచారణ కోసం అదుపులోకి తీసుకుంది.