Polavaram News : పోలవరంలో విషాదం-గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు మృతి
Polavaram News : పోలవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలవరం వద్ద ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు.
Polavaram News : పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. పోలవరంలో తాపీ పనికి వచ్చిన కొవ్వూరుపాడుకు చెందిన ఆరుగురు పని పూర్తి చేసుకుని సరదాగా గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగారు. వీరిలో ముగ్గురు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గల్లంతైన వారు మహేశ్(21), సుబ్రహ్మణ్యం(19), రాజేశ్(19)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు, మరోకరి కోసం గాలిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో విషాదం
వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలోఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. గ్రామ శివారులోని బావిలో ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో శ్రీనాథ్(15) అనే విద్యార్థి మృతి బావిలో మునిగిపోయాడు. ముగ్గురు విద్యార్థులు ఇటుకాలపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన శ్రీనాథ్ మృత దేహం కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో
జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలోని చెరువులో ఆదివారం ఈతకు(Swimming) వెళ్లి ముగ్గురు విద్యార్థుల ప్రమాదవశాత్తు మునిగిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం ఉదయం గొలుసుల యశ్వంత్(13), మారంపల్లి శరత్(14), పబ్బతి నవదీప్(10) గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు(Students Died) నీటిలో మునిగిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు యశ్వంత్ మృతదేహాన్ని గుర్తించారు. కాసేపటి తర్వాత మరో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఐ కోటేశ్వర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల వరంగల్ లో విషాద ఘటన
వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగళదాసు కృష్ణమూర్తి మార్చి 14న ఆదివారం కావడంతో తన మనవళ్లు దీపక్, కార్తీక్‌లతో పాటు కొడుకు నాగరాజుతో కలిసి వ్యవసాయ బావివద్దకు వెళ్లారు. అక్కడ మొక్కజొన్న చేను కోసిన తర్వాత వాటిని బస్తాల్లో నింపారు. ఆ తర్వాత స్నానం చేసేందుకు పక్కనే ఉన్న ఓ బావి వద్దకు తన మనవళ్లతో పాటు కృష్ణమూర్తి చేరుకున్నారు. ముందుగా తన పెద్ద మనవడు కార్తీక్‌కు స్నానం చేయించి ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత దీపక్‌ను తీసుకువెళ్లి స్నానం చేయిస్తుండగా దీపక్ అకస్మాత్తుగా కాలు జారీ నీళ్లలో పడ్డాడు. అయితే బావి లోతుగా ఉండడంతో మనవడు మునిగిపోతుండడం చూసిన కృష్ణమూర్తి వెంటనే నీళ్లలోకి దిగాడు. తనకు ఈత రాకున్న మనవడిని కాపాడాలనే కంగారులో నీళ్లలోకి దూకారు. దీంతో ఇద్దరు నీళ్లలో మునిగిపోవడంతో గట్టుపై ఉన్న మరో మనవడు కార్తీక్ వెంటనే తన తండ్రిని అప్రమత్తం చేశాడు. గట్టిగా కేకలు వేసి తండ్రి నాగరాజును తీసుకువచ్చాడు. దీంతో నాగరాజు సైతం ఏ మాత్రం ఆలోచించకుండా తనతండ్రితో పాటు కొడుకును కాపాడుకునేందుకు నీళ్లలోకి దూకాడు. దీంతో ముగ్గురికి ఈత రాకపోవడంతో ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరోకరు ప్రాణాలు వదలడం అది కూడా ఒకే కుటుంబానికి చెందిన తాత, తండ్రి కొడుకులు కావడం మరింత హృదయవిదారకంగా మారింది. ఒకే కుటుంబంలో మూడు తరాల వ్యక్తులు చనిపోవడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.