Kakinada Crime : పెన్షన్ పెరిగిందని సంతకం - తీరా చూస్తే వృద్ధురాలి ఇల్లు రిజిస్ట్రేషన్ - కాకినాడ వాలంటీర్ నిర్వాకం !
కాకినాడలో వృద్ధురాలిని వాలంటీర్ మోసం చేశారు. పెన్షన్ పెరిగిందని చెప్పి ఇల్లు అమ్మిన పత్రాలపై వేలిముద్ర తీసుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై వృద్ధురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
" అవ్వా మన సీఎం జగనన్నా నీ పెన్షన్ ను రెండున్నర వేలు చేశారు.." అని వాలంటీర్ చెబితే ఆ అవ్వ సంతోషపడింది. అయితే ఆ పెన్షన్ పెరగాలంటే ఓ సంతకం చేయాలన్నాడు వాలంటీర్. చదువు రాదు కాబట్టి సంతకం చేయలేను నాయనా వేలిముద్ర వేస్తానన్నది ఆ వృద్ధురాలు. అనుకున్నట్లుగా ఆ వాలంటీర్ ఆ వృద్ధురాలి వేలి ముద్ర తీసుకుని వెళ్లాడు. తర్వాతి నెల రూ.రెండున్నర వేల పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ రెండు రోజులకే ఆ వృద్ధురాలి గుండె ఆగినంత పనైపోయింది. తనకు ఒకే ఒక్క ఆధారంగా ఉన్న తనది కాదని.. వాలంటీర్‌దని రికార్డుల్లో ఉందని తెలియడమే దీనికి కారణం. దీంతో ఆ వృద్ధురాలు లబోదిబోమంటూ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి అసలు తన ఇల్లు వాలంటీర్ పేరు మీదకు ఎలా మారిందో తెలుసుకుంది. వారు చెప్పిన మాటలు విని ఆ వృద్ధురాలకు జరిగిన మోసం అర్థం అయింది.
అసలు విషయం ఏమిటంటే వాలంటీర్ పెన్షన్ పెరిగిందని దానికి సంతకం కావాలని చెప్పి వేలిముద్రలు తీసుకున్నాడు. నిజానికి ఆ వేలి ముద్రలు పెన్షన్ కోసం కాదు... ఆ ఇల్లు అమ్మినట్లుగా తప్పుడు డాక్యుమెంట్లు రెడీ చేసి.. వాటి మీద వృద్ధురాలి సంతకం తీసుకున్నాడు. చదువురాని ఆ వృద్ధురాలు .. పెన్షన్ కోసమే గా అని వేలిముద్రలు వేసింది. ఆ వాలంటీర్ ఆ పత్రాలు తీసుకెళ్లి ఆ వృద్దురాలు తనకు ఇల్లు అమ్మేసిందని చెప్పుకోవడం ప్రారంభిచాడు. పత్రాలు కూడా సృష్టించుకున్నాడు. దీంతో ఆ వృద్ధురాలు.. చనిపోయే వరకూ కూడా తనకు నిలువ నీడ లేకుండా చేయాలనుకుంటున్నారని మథన పడింది. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
పింఛను పెరిగిందని చెప్పి, తన ఆస్తిని విక్రయించేందుకు వార్డు వలంటీర్, ఇద్దరు స్థానిక నాయకులు సంతకాలు తీసుకున్నారని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆ వృద్ధురాలు పేర్కొన్నారు. కినాడ రూరల్ ఎంపీడీఓ ను విచారణ అధికారిగా కలెక్టర్ సీ హెచ్ హరి కిరణ్ నియమించి విచారణ చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే వాలంటీర్ సంతకం తీసుకోవడం.. తర్వాత దాన్ని అమ్మినట్లుగా ప్రచారం చేస్తూండటం కలకలం రేపుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వారు గొప్ప సేవ చేస్తున్నారని చెబుతూ ఉంటారు. రేపు ఉగాదికి వారికి సన్మానాలు కూడా చేయనున్నారు. అయితే కొందరి నిర్వాకం వల్ల ఆ వ్యవస్థకి చెడ్డపేరు వస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కొందరు వాలంటీర్లు వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భాలు అనేకం గతంలో చోటు చేసుకున్నాయి. దీనికి కాకినాడ వాలంటీర్ వ్యవహారం తోడైంది.