Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో మార్కులు బాగా రావనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Visakha News : విశాఖలో విషాద ఘటన జరిగింది. నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖలో వరసగా ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇందులో అధిక సంఖ్య విద్యార్థులే ఉండడం గమనార్హం. కడుపులో నొప్పి ఉండడం వల్ల రెండు రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగానని పరీక్షలలో తనకు బాగా మార్కులు రావనే మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో, బోయపాలెం దగ్గర గల నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుచున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థినిని వెంటనే కొమ్మాదిలో గల గాయత్రి హాస్పిటల్ కి తరలించగా కానీ అప్పటికే విద్యా్ర్థిని మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. బాలిక ఆత్మహత్య వెనుక చదువుల ఒత్తిడే కారణమా? ఇంకేదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పీఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
"అమ్మా, డాడీ సారీ, అసలు నేను ఇలా చేస్తానని ఏ రోజు అనుకోలేదు. నేను ఇలా చేసుకునేందుకు కారణం ఎవరికి తెలియదు. నేను ఈ పరీక్ష బాగా రాయలేదు. IIA వరకు బాగానే రాశాను కానీ తర్వాత కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తిరిగి అసలు ఏం చదవలేకపోయాను. IIB, ఫిజిక్స్ అసలు బాగా రాయలేదు. ఫిజిక్స్ అయితే అసలు బాగా రాయలేదు. పాస్ అవుతాను కానీ వచ్చే మార్కులు నా పర్సంటేజ్ ను తగ్గించేస్తుంది. కానీ అందరూ మిమ్మల్ని అదోలా చూస్తారు. నాకు వచ్చే మార్కుల వల్ల నాన్న మీరు నలుగురిలో తల ఎత్తుకోలేరు. నా వల్ల మీరు తలదించుకోకూడదు. నేను సూసైడ్ చేసుకోవాలని ఎగ్జామ్ హాల్ లోనే అనుకున్నాను. చివరి నిమిషంలోనైనా సంతోషంగా ఉందామని అందరితో సంతోషంగా ఉన్నాను. నేను ఇలా చేసినందుకు మీరు ఏడుస్తారు సారీ, కానీ నాకు చాలా తక్కువ మార్కులు వస్తాయి, అందుకు నేను డిప్రషన్ లోకి వెళ్లిపోయాను.అందుకే ఇలా చేస్తున్నాను." - విద్యార్థిని
నార్సింగిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. మార్చి 24న మంచిరేవుల గ్రామంలో సాయి తేజ అనే విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయి తేజ ఆత్మహత్య కు గల కారణాలను తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. అయితే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుతున్న క్రమంలో సాయి తేజ ఇలా బలవన్మరణాకి పాల్పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదువుల ఒత్తిడి కారణంగానే తమ అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు.