Visakha News: ఆటల్లో పడి ఇంటికెళ్లడం మర్చిపోయారు- పోలీసులను కంగారు పెట్టారు!
Visakha News: నలుగురు విద్యార్థులు ఆటల్లో పడి ఇంటికెళ్లాల్సిన విషయమే మర్చిపోయారు. అప్పటికే చాలా సేపు కావడంతో కిడ్నాప్ అయ్యామంటూ డ్రామా మొదలు పెట్టారు. పోలీసులను కూడా రంగంలోకి దింపారు. చివరకి..?
Visakha News: ఉదయం అనగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం వరకూ విపరీతంగా ఆడుకున్నారు. ఆటల ధ్యాసలో అన్నం తినడంతోపాటు ఇంటికెళ్లడం కూడా మర్చిపోయారు. అయితే ఇంత ఆలస్యంగా వెళ్తే అమ్మా నాన్నలు ఏమంటారోనన్న భయంతో అదిరిపోయే ప్లాన్ వేశారు. కిడ్నాప్ అయ్యామంటూ డ్రామా మొదలు పెట్టారు. ఇదే విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్తే నమ్మరని.. ఏకంగా 100 డయల్ కు ఫోన్ చేశారు. తాము కిడ్నాప్ అయ్యామని చెప్పారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. పిల్లలను పట్టుకున్నారు. వారు కిడ్నాప్ కాలేదనని గుర్తించి.. ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విశాఖపట్నం జిల్లా గాజువాకలోని 69వ వార్డు రెడ్డితంగ్లాంకు చెందిన నలుగురు పిల్లలు ఆదివారం ఉదయం ఆడుకోవడానికి కుక్కవానిపాలెం వద్ద గల చెరువు వద్దకు వెళ్లారు. వీరి వయసు 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే హాయిగా ఆడుకున్నారు. ఆట ధ్యాసలో పడి ఇంటికెళ్లాలన్న విషయాన్నే మర్చిపోయారు. చాలా ఆలస్యం అయిపోయిందని గుర్తించి.. లేటుగా వెళ్లతే తల్లిదండ్రులు తిడ్తారని మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఆ చిన్ని బుర్రల్లో సినిమా రేంజ్ కథ మెరిసింది. ఇంకేం దాన్నే అమలు చేద్దామనుకున్నారు. వెంటనే 100 డయల్ కు ఫోన్ చేసి తాము కిడ్నాప్ అయ్యామని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పిల్లలను వెతికేందుకు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
ఈ క్రమంలోని పిల్లలు చుక్కవానిపాలెం సువర్ణ శ్రీనివాసం అపార్ట్ మెంట్స్ పక్కనున్న ఎంవీపీ బిల్డర్స్ అపార్ట్ మెంట్స్ వెనక ఉన్నట్లు తెలుసుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే వారు కిడ్నాప్ అయినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో.. పిల్లలను విచారించారు. వారు చెప్పిన నిజాలు విని షాక్ కు గురయ్యారు. ఇంటికి ఆలస్యంగా వెళ్తే తల్లిదండ్రులు తిడతారనే భయంతోనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పిల్లలు ఒప్పుకున్నారని గాజువాక ఎస్ఐ సతీష్ తెలిపారు. వెంటనే నలుగురు పిల్లలను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి వారికి విషయం తెలిపారు.
ఇటీవలే తిరుపతిలో ఐదుగురి విద్యార్థులు అదృశ్యం..
ఈనెల 9వ తేదీన నెహ్రూ నగర్‌లోని అన్నమయ్య ప్రైవేటు పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు స్కూల్‌లో పరీక్ష రాసిన తర్వాత టిఫిన్ చేసేందుకు ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి ఎటో వెళ్లిపోయారు. ఇంటికి పిల్లలు రాలేదని తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఆరా తీస్తే అక్కడ కూడా లేరు. ఇందులో ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. విద్యార్థుల అదృశ్యం పై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం ఐదు ప్రత్యేక బృందలు ఏర్పాటు చేసి గాలించారు.
రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. వారందరూ కూడా ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్నట్టు వెస్ట్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. వారు ఆగ్రాలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు తక్షణం ఆగ్రా పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు తిరుపతి వెస్ట్ పోలీసులు హుటాహుటిన ఆగ్రాకు పయణమయ్యారు. సోమవారం సాయంత్రానికి విద్యార్థులు తిరుపతికి చేరుకోనున్నారు.. స్కూల్ నుండి ఎందుకు పరార్ కావాల్సిన వచ్చింది.. పరార్ అయ్యేందుకు వీరి వెనుక మరెవరైనా ఉన్నారా అనే విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది..