Vijayawada: పక్కవీధి మహిళతో భర్త ఆరేళ్లుగా అఫైర్, ఊహించని షాక్ ఇచ్చిన భార్య!
ఘర్షణలో భాగంగా భార్య కట్టుకున్న భర్తని కత్తితో పొడవడంతో అతను చనిపోయాడు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఈ ఘటన జరిగింది.
వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. కొన్నేళ్లుగా పరాయి వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకున్న ఘటనల్లో ఇలాంటి నేరాలు ఎన్నో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా తాత్కాలిక సుఖాల కోసం కొంత మంది అలాంటి సంబంధాలను కొనసాగిస్తున్నారు. గుట్టు బయటికి తెలియనంత కాలం జీవితం సాఫీగానే సాగిపోతున్నా.. ఆ విషయం బయటపడగానే కుటుంబాల్లో పెను కుదుపులకు దారి తీస్తోంది. తాజాగా అలాంటి వివాహేతర సంబంధమే విజయవాడలో ఒకరి ప్రాణం తీసింది. ఘర్షణలో భాగంగా భార్య కట్టుకున్న భర్తని కత్తితో పొడవడంతో అతను చనిపోయాడు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఈ ఘటన జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామవరప్పాడు కాలువగట్టు ప్రాంతంలో వాన రమణ అనే 30 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు (కుమారుడు, కుమార్తె) ఉన్నారు. ఇతను తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
రామవరప్పాడు కాలువగట్టు ప్రాంతంలోనే వీరు ఉండే వీధికి పక్క వీధిలో మీసాల లక్ష్మి అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె తన భర్త, ఇద్దరు కొడుకులతో కలిసి నివసిస్తోంది. అయితే, రమణ, లక్ష్మి మధ్య ఆరేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తూ ఉంది. పిల్లలు పెద్దవారు అవుతున్నారని, అందుకని వివాహేతర సంబంధం మానుకోవాలని రమణను లక్ష్మి దూరం పెట్టింది. ఆమె దూరం పెట్టడంతో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే భర్త రమణపై భార్య లక్ష్మి పటమట పోలీస్ స్టేషన్‌లో రెండు సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చింది.
లక్ష్మి తన భర్తను దూరం పెడుతుండడంతో ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని భర్త రమణ అనుమానం పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతను లక్ష్మి ఇంటికి వెళ్లి తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ గొడవకు దిగాడు. దీంతో ఆమె ప్రతివాదనకు దిగింది. చివరికి సహనం కోల్పోయిన లక్ష్మి కూరగాయలు కోసే చాకుతో రమణ పొట్టలో పొడిచింది. తీవ్రంగా గాయపడి రక్తం ఏరులై కారింది. దీంతో అతడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగా అతని పరిస్థితి మరింత విషమించింది. గురువారం (జనవరి 26) ఉదయం రమణ మృతి చెందాడు. నిందితురాలు అయిన లక్ష్మిని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.