Jublie Hills Case : ఆ నలుగురూ మైనర్లు కాదు మేజర్లే - ఎమ్మెల్యే కొడుకు మాత్రం సేఫ్ !
సంచలనాత్మక కేసులో నలుగురు మైనర్లును మేజర్లుగా గుర్తించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే బెయిల్ పొందిన వారు..మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు.
Jublie Hills Case : సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు కోర్టు షాక్ ఇచ్చింది. ట్రైల్ సందర్భంగా నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే కొడుకు మాత్రం జూవైనల్ గా పరిగనించాలని తెలిపింది. జూవైనల్ జస్టిస్ సెక్షన్ 15 ప్రకారం నలుగురు CCL లను మేజర్లు గా అంచనా కు వచ్చింది కోర్టు. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని భావించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యులు సమీక్షించి ఇచ్చిన నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఐదుగురు నిందితులకు మెచ్యూరిటీ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని పోలీసులు పిటిషన్ వేశారు. మేజర్లకు ఉండాల్సిన లక్షణాలన్నీ వారికి ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అందువల్ల నిందితులను మైనర్లుగా కాకుండా, మేజర్లుగా పరిగణించాలని కోరారు. దీనిపై నాంపల్లి కోర్టు విచారణ జరిపి ఈ నిర్ణయాన్ని ప్రకటించంది.
మేలో పబ్ నుంచి మైనర్‌ను తీసుకెళ్లి అత్యాచారం చేసిన నిందితులు
ఈ ఏడాది మే 28వ తేదీన జూబ్లీహిల్స్ లో అమ్నిషియా పబ్‌లో పార్టీకి హాజరైన విద్యార్ధినిని కారులో తీసుకెళ్లిన నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను Arrest చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఎక్కువగా ప్రజా ప్రతినిధులకు చెందిన పిల్లలు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరు మేజర్ కాగా, ఐదుగురు మైనర్లు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఉపయోగించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మరో వైపు వాహనంలోని కీలక సాక్ష్యాలను కూడా సేకరించారు.
ఇప్పటికే బెయిల్‌పై విడుదలైన నిందితులు .. మరోసారి జైలుకెళ్లే అవకాశం
కొద్ది రోజుల కిందటే నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జువైనల్ హోం నుండి నలుగురు మైనర్లు బయటకు వచ్చారు. నిందితులకు షరతులతో కూడిన బెయల్ ను మంజూరు చేసింది జువైనల్ బోర్డు. నలుగురు నిందితులకు రూ. 5 వేల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో విచారణకు కూడా సహకరించాలని కోర్టు సూచించింది. అయితే కోర్టు ఇప్పుడు వీరిని మేజర్లుగా పరిగణించాలని తీర్పు ఇవ్వడంతో వారి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మళ్లీ వారు జైలుకెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కుమారుడు మాత్రం జువైనల్‌గానే భావిస్తున్నారు కాబట్టి ఆయనకు శిక్ష కూడా పెద్దగా ఉండని చెబుతున్నారు.
రాజకీయంగానూ సంచలనం
ఈ కేసులో నిందితులు అందరికీ రాజకీయ నేపధ్యం ఉంది.. వారి కుటుంబసభ్యులు వివిధ పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్నారు . మొదట పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చూపడంతో విమర్శలు వచ్చాయి. నిందితుల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ కేసు కలకలం రేపడంతో పోలీసులు చురుగ్గా స్పందించారు. నిందితులు రికార్డుల పరంగా మైనర్లు కావడంతో తక్కువ శిక్,లతో తప్పించుకునే అవకాశం ఉండటంతో న్యాయస్థానానికి వెళ్లి మరీ మేజర్లుగా పరిగణించేలా ఉత్తర్వులు తెచ్చారు.