Anantapuram News: కొంపముంచిన గూగుల్ మ్యాప్స్ - లోయలోకి వెళ్లిన కంటైనర్, రాత్రంతా దిక్కుతోచని స్థితిలో..
Andhra News: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని ఓ కంటైనర్ డ్రైవర్ ప్రమాదానికి గురైన ఘటన అనంత జిల్లా యాడికిలో చోటు చేసుకుంది. దిక్కుతోచని స్థితిలో రాత్రంతా చీకట్లోనే గడపగా ఉదయం స్థానికులు అతన్ని రక్షించారు.

The Container Fell Into The Valley While Trusting Google Maps In Anantapuram: కొన్నిసార్లు టెక్నాలజీని పూర్తిగా నమ్మకం కూడా ప్రమాదమే. ఇదివరకూ ఫోన్‌లో మ్యాప్స్‌ను నమ్ముకుంటూ కొందరు దారి తప్పడం చూశాం. కొందరు ప్రమాదాలకు గురి కావడం చూశాం. అర్ధరాత్రి గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న ఓ కంటైనర్ డ్రైవర్ వాహనాన్ని కొండల్లో గోతిలోకి దింపాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా (Anantapuram District) యాడికి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని చిక్కమంగళూరు నుంచి అనంత జిల్లా తాడిపత్రి (Tadipatri) మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ ఓర్ కంటైనర్ లారీ బయలుదేరింది. డ్రైవర్ ఫరుక్ దారి కన్ఫ్యూజ్ అయి తన స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చాడు.
అర్ధరాత్రి సమయంలో మ్యాపు చూపించిన దారి గుండా కంటైనర్‌ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి యాడికి మండలంలోని కొండల్లో ఉన్న రామన్న గుడిసెల గ్రామ సమీపంలోకి వెళ్లిపోయాడు. అక్కడ లారీ అదుపు తప్పి గోతుల్లో ఇరుక్కుపోయింది. రాత్రంతా చిమ్మ చీకట్లో దిక్కుతోచని స్థితిలో డ్రైవర్ బిక్కు బిక్కుమంటూ గడిపాడు. ఏమీ చేసేది లేక అలానే ఉండిపోయాడు. ఉదయం ప్రమాదాన్ని గమనించిన స్థానికులు డ్రైవర్‌ను రక్షించారు. అతను యజమానికి సమాచారం ఇవ్వగా.. 2 జేసీబీలను తెప్పించి కంటైనర్‌ను బయటకు తీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

