Crime News: వివాహిత స్నానం చేస్తుండగా చూశాడని యువకుడి దారుణహత్య, నిందితులు అరెస్ట్
Tamil Nadu Crime News | సోదరి స్నానం చేస్తుండగా మేడపై నుంచి తొంగి చూశాడని ఓ యువకుడ్ని దారుణహత్య చేశారు. తమిళనాడులోని ఆర్కే నగర్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.

చెన్నై(ఆర్కేనగర్): చేపల చెరువు వద్ద తీవ్రగాయాలతో పడి ఉన్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వివాహిత స్నానం చేస్తుండగా తొంగి చూడటమే హత్యకు కారణమని తేల్చారు. తమిళనాడులోని ఆర్కేనగర్ పుదుచ్చేరి బాగూర్ లో రెండు రోజుల కిందట జరిగిన వెల్డర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
అసలేం జరిగిందంటే..
కరైయాంబదూర్- పనైయడికుప్పం సమీపంలో దినేష్‌బాబు (27) నివాసం ఉంటున్నాడు. ఇటీవల దినేష్ సోదరికి వివాహం జరిపించాడు. ఆమె ఇంట్లో స్నానం చేస్తుండగా పనైయడికుప్పంకు చెందిన వెల్డర్ రాజగురు (34) మేడపై నుంచి చూశాడు. విషయం తెలుసుకున్న దినేష్ వెల్డర్ రాజగురును హత్య చేయాలని భావించాడు.
సోమవారం నాడు తన స్నేహితులు సుమిత్, అచ్యుతన్, సహా శర్మ, ముఖిలన్ లతో కలిసి వెళ్లి ప్లాన్ ప్రకారం వెల్డర్ రాజగురుపై దాడి చేశారు. రాజగురును కరైయాంబదూర్-పనైయడికుప్పం రోడ్డులో ఉన్న చేపల చెరువు వద్దకు తీసుకెళ్లి రక్తం వచ్చేలా దాడిచేశారు. అతడు చనిపోయాడని భావించి దినేష్ బాబు సహా నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఓ యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నాడని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాధితుడ్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం వెల్డర్ రాజగురు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అదే ప్రాంతంలో కొందరు అనుమానితులను అదుపులోకితీసుకుని విచారణ జరిపారు. తామే హత్య చేసినట్లు దినేష్ బాబు అంగీకరించాడు. తన చెల్లికి ఇటీవల వివాహమైందని.. ఆమె స్నానం చేస్తుండగా రాజగురు మేడపైనుంచి తొంగి చూడటంతో అవమానంగా భావించి హత్య చేశామని తెలిపాడు.
కాబోయే భార్యను కత్తితో పొడిచి దారుణహత్య
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో దారుణం జరిగింది. 28 ఏళ్ల వ్యక్తి తనకు కాబోయే భార్యను కత్తితో దాడిచేసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినేష్, సౌందర్య (25) శ్రీపెరంబుదూర్‌లోని ఒకే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. 8 నెలల కిందట నిశ్చితార్థం చేసుకున్నారు. ఒకే బిల్డింగ్ లోని వేర్వేరు ఇళ్లలో వీరు నివాసం ఉంటున్నారు. త్వరలో వీరు పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి నిందితుడు దినేష్ తరచుగా సౌందర్యతో గొడవ పడేవాడు. శనివారం మరోసారి గొడవ పడ్డాడు. ఆవేశంలో కత్తితో సౌందర్యపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






















