Hyderabad Crime: మనిషి కాదు మృగం, ఎనిమిదేళ్ల కూతుర్ని చంపిన తండ్రి - కారణం ఏంటంటే!
Hyderabad Crime: బీహెచ్ఈఎల్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ తండ్రి కన్న కూతురుని బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. భార్యపై పగ పెంచుకున్న భర్త అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురి ప్రాణం తీశాడు.
Hyderabad Crime: బీహెచ్ఈఎల్ లో దారుణం వెలుగుచూసింది. ఓ తండ్రి కన్న కూతురుని బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. భార్యపై పగ పెంచుకున్న భర్త అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురుని కర్కషంగా చంపి ప్రాణం తీశాడు. వివరాలు.. నగరంలో ఉంటున్న చంద్రశేఖర్, హిమ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. వీరికి మోక్షజ అనే 8 ఏళ్ల కూతురు ఉంది. ఏడాది కిందట చంద్రశేఖర్ జాబ్ పోయింది. దీంతో సైకోగా ప్రవర్తిస్తున్నాడు. తరచూ భార్య హిమతో గొడవ పడేవాడు.
కుటుంబంలో సఖ్యత లేకపోవడం, భర్త తరచూ గొడవ పడుతుండడంతో హిమ తల్లి వద్దకు వెళ్లింది. అయినా చంద్రశేఖర్ వేధింపులు తగ్గలేదు. తనకు దూరంగా ఉంటున్న భార్య హిమకు సంతోషం లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. మోక్షజ చదివే పాఠశాలకు వెళ్లిన కూతురిని తీసుకుని కారులో బయల్దేరాడు. కొంత దూరం వెళ్లిన తరువాత బ్లేడుతో కర్కషంగా మోక్షజ గొంతు కోశాడు. బాలిక డెడ్ బాడీని రింగ్ రోడ్డు పక్కన పడేయాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి వరకు రింగ్ రోడ్డుపైనే రౌండ్లు కొట్టాడు.
ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటలకు నిద్రమత్తులో కారు డివైడర్‌ను ఢీకొట్టాడు. అక్కడే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ప్రమాదాన్ని గమనించి అక్కడి వెళ్లి చూడగా షాక్‌కు గురయ్యారు. కారు వెనుక సీటులో మోక్షజ డెడ్ బాడీని గుర్తించి చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పొంతనలేని వివరాలు చెబుతుండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో చంద్రశేఖర్ అసలు విషయం చెప్పాడు. తనకు దూరంగా ఉంటున్న భార్యను బాధపెట్టాలనే ఉద్దేశంతో కూతురిని చంపినట్లు చెప్పాడు.
తన భార్య హిమ, తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. తన ఉద్యోగం పోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపాడు. తనకు దూరంగా ఉంటున్న భార్యకు సంతోషం లేకుండా చేసేందుకు తన ఎనిమిదేళ్ల కూతురిని హతమార్చినట్లు వెల్లడించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.