Sangareddy News: సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సీసీ అనుమానాస్పద మృతి, ఒంటిపై కాలిన గాయాలు
గడిల విష్ణువర్ధన్ అనుమానాస్పద రీతిలో కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్‌షిప్ వద్ద కాలిన గాయాలతో ఉన్నట్లు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వద్ద క్యాంప్ క్లర్క్ గా పని చేస్తున్న గడిల విష్ణువర్థన్ అనే 44 ఏళ్ల వ్యక్తి చనిపోవడం అనుమానాలకు తావు ఇస్తోంది. ఇతను సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాధురి వద్ద క్యాంప్ క్లర్క్ (సీసీ)గా పని చేస్తున్నాడు. ఈయన చనిపోయినట్లుగా ఆదివారం (అక్టోబరు 29) ఉదయం పోలీసులు గుర్తించారు.
గడిల విష్ణువర్ధన్ అనుమానాస్పద రీతిలో కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్‌షిప్ వద్ద కాలిన గాయాలతో ఉన్నట్లు గుర్తించారు. శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లలేదని తెలుస్తోంది. ఆయనకు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. శనివారం రాత్రి వేళ భార్య శివ కృష్ణ కుమారి ఫోన్ చేయగా.. విష్ణు వర్థనే మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్య కారణాలతో గత నెల రోజులుగా ఆయన సెలవు పెట్టారని కలెక్టరేట్ ఉద్యోగులు తెలిపారు. ఉన్నట్లుండి విష్ణువర్ధన్ చనిపోవడం, ఒంటిపై కాలిన గాయాలు ఉండడంతో అది హత్యా? ఆత్మహత్యా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగ జీవితంలో సమస్యల నుంచి ఫ్యామిలీ పరంగా గొడవలు ఏమైనా ఉన్నాయా? అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.