Kamal Kaur Bhabi Murder: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య - అందుకే చంపేశానంటూ కిల్లర్ వీడియో.. ఇద్దరి అరెస్ట్
Kamal Kaur: పంజాబ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ బాబీ దారుణ హత్య తీవ్ర ఆందోళన కలిగించింది. అమృత్ పాల్ సింగ్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు నిర్ధారణ కాగా.. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Punjab Social Media Influencer Kamal Kaur Bhabhi Murdered: పంజాబ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ బాబీ (30) దారుణ హత్యకు గురయ్యారు. కాంచన కుమారిగా పేరొందిన ఆమె.. బోల్డ్ కంటెంట్‌తో పాటు కొన్ని ఫన్నీ వీడియోస్‌తో నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. కొన్ని పోస్టుల విషయంలో వివాదాలు, విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆమె హత్యకు గురైన తర్వాత ఫాలోవర్స్ మరింత పెరిగారు.
అసలేం జరిగిందంటే?
పంజాబ్‌లోని బటిండాలో ఈ నెల 11న (బుధవారం) రాత్రి ఆదేశ్ మెడికల్ యూనివర్శిటీ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఆమె విగతజీవిగా కనిపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్య చేసినట్లు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ గ్యాంగ్ పనేనా..
కాంచన కుమారిని అమృతపాల్ సింగ్ గ్యాంగ్ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తుందని.. అందుకే చంపేసి శిక్ష విధించినట్లు ఓ వీడియో రిలీజ్ చేయగా అది వైరల్ అవుతోంది. పంజాబ్‌లో ఇలాంటి వాటికి ఆస్కారం లేదని.. మిగతా వారికీ ఇలాంటి గతే పడుతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
ఈ హత్యకు సంబంధించి ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు అమృత్ పాల్ సింగ్ మెహ్రాన్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ అమ్‌నీత్ కొండల్ వెల్లడించారు. కాంచన్ కుమారిని నిందితులు గొంతు నులిమి చంపారని.. అనైతిక కంటెంట్ అప్‌లోడ్ చేసిందనే కారణంతో ఆమెను చంపేసినట్లు నిందితులు విచారణలో చెప్పినట్లు తెలిపారు.
గత వారం బిజినెస్ మీటింగ్ నెపంతో అమృత్ పాల్ సింగ్.. కాంచన్ కుమారిని సంప్రదించాడని పోలీసులు తెలిపారు. పెయిడ్ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెను బటిండా ఆహ్వానించాడని.. ఈ నెల 9న మధ్యాహ్నం లూథియానాలోని తన ఇంటి నుంచి జస్ప్రీత్, నిమ్రత్ జిత్‌తో కలిసి బయలుదేరిన కాంచన్‌ను గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
అసలెవరీ కమల్ కౌర్?
పంజాబ్ లూథియానాకు చెందిన 30 ఏళ్ల యువతి కాంచన కుమారి. కమల్ కౌర్ బాబీగా ఆమె సోషల్ మీడియాలో బాగా పేరు సంపాదించారు. ఇన్ స్టాగ్రామ్‌లో 3.84 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 'ఫన్నీ బాబీ' పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఉండగా.. 2.36 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. డైలీ రొటీన్ అంశాలతో పాటు కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా ఆమె షేర్ చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు బోల్డ్ కంటెంట్, ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ షేర్ చేయగా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కమల్ తన చివరి పోస్టుకు 'నో ఎమోషన్, నో లవ్' అనే క్యాప్షన్ ఇవ్వగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
ఆమె తరచూ బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని.. గుణపాఠం చెబుతానని ఇది వరకే అమృత్ పాల్ సింగ్ ఆమెను హెచ్చరించినట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.





















